క్వార్టర్ ఫైనల్లో అజరెంకా | Victoria Azarenka Rallies to Advance to US Open Quarterfinal | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో అజరెంకా

Published Wed, Sep 4 2013 1:20 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM

క్వార్టర్ ఫైనల్లో అజరెంకా

క్వార్టర్ ఫైనల్లో అజరెంకా

 న్యూయార్క్: గత ఏడాది రన్నరప్, రెండో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) యూఎస్ ఓపెన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అజరెంకా 4-6, 6-3, 6-4తో 13వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించి హంతుచోవాతో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో హంతుచోవా (స్లొవేకియా) 6-3, 5-7, 6-2తో అలీసన్ రిస్కీ (అమెరికా)పై, పెనెట్టా (ఇటలీ) 6-2, 7-6 (7/3)తో 21వ సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా)పై నెగ్గారు.
 
 ఎదురులేని నాదల్
 పురుషుల సింగిల్స్ విభాగంలో తన జోరు కొనసాగిస్తూ రెండో సీడ్ రాఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్ 6-7 (4/7), 6-4, 6-3, 6-1తో 22వ సీడ్ కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై గెలిచాడు. మరోవైపు రొబ్రెడో చేతిలో ఫెడరర్ ఓడిపోవడంతో యూఎస్ ఓపెన్‌లో నాదల్, ఫెడరర్‌ల మధ్య తొలిసారి ముఖాముఖి పోరు చూడాలనుకున్న వారికి నిరాశే ఎదురైంది. ఫెడరర్, నాదల్ ఇప్పటిదాకా కెరీర్‌లో 31 సార్లు తలపడ్డారు. యాదృచ్ఛికంగా వీరిద్దరికీ ఒక్కసారి కూడా యూఎస్ ఓపెన్‌లో ఎదురెదురుగా ఆడే పరిస్థితి రాలేదు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 7-6 (7/2), 3-6, 7-5, 7-6(7/3)తో టిప్సరెవిచ్ (సెర్బియా)పై; రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)  6-7 (4/7), 7-6 (7/4), 2-6, 6-7 (9/11), 7-5తో రావ్‌నిక్ (కెనడా)పై గెలిచారు.
 
 ఇక్కడా మూడో రౌండ్‌లోపే
 స్వదేశంలో జరుగుతున్న గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లోని పురుషుల సింగిల్స్ విభాగంలో అమెరికా నుంచి ఒక్కరు కూడా కనీసం నాలుగో రౌండ్‌కు చేరుకోలేకపోయారు. బరిలో నిలిచిన చివరి క్రీడాకారుడు టిమ్ స్మీజెక్ (అమెరికా) మూడో రౌండ్‌లో 4-6, 6-4, 6-0, 3-6, 5-7తో  గ్రానోలెర్స్ (స్పెయిన్) చేతిలో ఓడిపోవడంతో అమెరికా కథ ముగిసింది. ఫలితంగా ఈ ఏడాది జరిగిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలోనూ పురుషుల సింగిల్స్ విభాగంలో అమెరికా నుంచి ఒక్కరు కూడా నాలుగో రౌండ్‌కు చేరుకోలేకపోయారు.
 
 దివిజ్ జోడి ఓటమి
 పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్ (భారత్)-యెన్ సున్ లూ (చైనీస్ తైపీ) జోడి మూడో రౌండ్‌లో ఓడిపోయింది. ఐదో సీడ్ ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్) -రోజర్ (నెదర్లాండ్స్) ద్వయం 7-6 (10/8), 3-6, 6-3తో దివిజ్- సున్ లూ జంటపై నెగ్గింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement