Australian Open: మాజీ ఛాంపియన్‌కు షాక్‌.. తొలి రౌండ్‌లోనే ఓటమి | Australian Open: Former Champion Azarenka Eliminated In First Round | Sakshi
Sakshi News home page

Australian Open: మాజీ ఛాంపియన్‌కు షాక్‌.. తొలి రౌండ్‌లోనే ఓటమి

Published Tue, Jan 14 2025 1:47 PM | Last Updated on Tue, Jan 14 2025 8:45 PM

Australian Open: Former Champion Azarenka Eliminated In First Round

మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండుసార్లు చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ విక్టోరియా అజరెంకా (బెలారస్‌) తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన పోరులో లూసియా బ్రాన్‌జెట్టి (ఇటలీ) 6–2, 7–6 (7/2)తో అజరెంకాను బోల్తా కొట్టించింది. 

17వసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో ఆడిన 26వ సీడ్‌ అజరెంకా తొలి రౌండ్‌లో ఓడిపోవడం నాలుగోసారి మాత్రమే కావడం గమనార్హం. 2012, 2013లలో విజేతగా నిలిచిన అజరెంకా ఆ తర్వాత ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. బ్రాన్‌జెట్టితో జరిగిన మ్యాచ్‌లో అజరెంకా 37 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. 

మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 2017 ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్, 16వ సీడ్‌ ఒస్టాపెంకో (లాత్వియా) 3–6, 6–7 (6/8)తో బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో ఓడిపోయింది. మరోవైపు రెండో సీడ్‌ స్వియాటెక్‌ (పోలాండ్‌), మూడో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా), ఏడో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా), మాజీ చాంపియన్‌ నయోమి ఒసాకా (జపాన్‌) తొలి రౌండ్‌లో గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. 

స్వియాటెక్‌ 6–3, 6–4తో సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, కోకో గాఫ్‌ 6–3, 6–3తో 2020 చాంపియన్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా)పై, పెగూలా 6–3, 6–0తో మాయా జాయింట్‌ (ఆస్ట్రేలియా)పై, 2019, 2021 విజేత ఒసాకా 6–3, 3–6, 6–3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌)పై విజయం సాధించారు.    

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement