
బంగ్లా ఆశలకు ‘స్టోక్స్’
తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపు
చిట్టగాంగ్: సువర్ణావకాశం వచ్చినట్టే వచ్చి బంగ్లాదేశ్ చేతుల్లోంచి చేజారింది. తమ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్‌పై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసుకునేందుకు కేవలం 33 పరుగులే చేయాల్సిన దశలో.. ఇంగ్లండ్ పేసర్ బెన్ స్టోక్స్ తమకు కావాల్సిన చివరి రెండు వికెట్లును ఒకే ఓవర్‌లో కూల్చి వారి ఆశలపై నీళ్లుజల్లాడు. 286 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్‌స ఆరంభించిన బంగ్లా ఆట చివరి రోజు సోమవారం తమ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 10 పరుగులను మాత్రమే జత చేసి 81.3 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌట్ అరుు్యంది. దీంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది.
ఒంటరి పోరాటంతో జట్టును విజయం అంచుల దగ్గరకు తీసుకువచ్చిన సబ్బీర్ రహమాన్ (102 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)కు చివరి రోజు సహకారం కరువైంది. కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బంగ్లా ఇన్నింగ్‌స సాగగా స్టోక్స్ ఒకే ఓవర్‌లో తైజుల్ ఇస్లామ్ (16), షఫీయుల్‌లను పెవిలియన్‌కు చేర్చడంతో ఆతిథ్య జట్టు షాక్‌కు గురైంది. మొత్తం ఆరు వికెట్లు తీసిన స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు ఈనెల 28 నుంచి ఢాకాలో జరుగుతుంది.