నాగపూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ తుది సమరం ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచ్ మూడో రోజు మంగళవారం విదర్భకు దీటుగా సమాధానమిచ్చిన సౌరాష్ట్ర చివర్లో తడబడింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో విదర్భకు 5 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 158/5తో ఆట కొనసాగించిన సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ స్నెల్ పటేల్ (209 బంతుల్లో 102; 15 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే జట్టు లోయర్ ఆర్డర్ పట్టుదలగా ఆడటంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి చేరువగా రాగలిగింది. 7 నుంచి 11వ బ్యాట్స్‌మెన్ వరకు చెప్పుకోదగ్గ పరుగులు చేశారు.
కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ (101 బంతుల్లో 46; 4 ఫోర్లు)తో పాటు ప్రేరక్ మన్కడ్ (62 బంతుల్లో 21; 2 ఫోర్లు), కమలేశ్ మక్వానా (61 బంతుల్లో 27; 3 ఫోర్లు), ధర్మేంద్ర జడేజా (32 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), చేతన్ సకరియా (82 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. వీరందరూ కలిసి 145 పరుగులు చేయడం విశేషం. ముఖ్యంగా పదునైన బౌలింగ్‌తో ఉమేశ్ యాదవ్... ప్రధాన బ్యాట్స్‌మన్ స్నెల్ పటేల్‌ను ఔట్ చేసిన తర్వాత సౌరాష్ట్ర చివరి మూడు వికెట్లకు 123 పరుగులు జోడించగలిగింది. ఆఖరి వికెట్‌కు ఉనాద్కట్, మక్వానా 60 పరుగులు జత చేశారు. విదర్భ స్పిన్నర్లు ఆదిత్య సర్వతే (5/98), అక్షయ్ వాఖరే (4/80) జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంతో కీలక పాత్ర పోషించారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. రామస్వామి సంజయ్ (16), ఫైజ్ ఫజల్ (10) ఔట్ కాగా... గణేశ్ సతీశ్ (24 బ్యాటింగ్), వసీం జాఫర్ (5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ ధర్మేంద్ర జడేజాకే ఈ 2 వికెట్లు దక్కాయి. పిచ్‌పై పగుళ్లు ఏర్పడి అనూహ్యంగా స్పందిస్తున్న స్థితిలో నాలుగో రోజు ధర్మేంద్ర జడేజా బౌలింగ్ కీలకం కానుంది. ప్రస్తుతం 60 పరుగుల ఆధిక్యంలో ఉన్న విదర్భ గట్టిగా నిలబడి ప్రత్యర్థికి ఎంత లక్ష్యం నిర్దేశిస్తుందో చూడాలి. మరోవైపు క్వార్టర్ ఫైనల్లో యూపీపై 372 పరుగులు, సెమీస్‌లో కర్ణాటకపై 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సౌరాష్ట్ర...మరోసారి నాలుగో ఇన్నింగ్స్‌లో బాగా ఆడగలమనే ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment