తల్లి విజయలక్ష్మితో విహారి
కాకినాడ: విహారి... ఇప్పుడీపేరు తెలియని క్రికెట్ అభిమాని లేడు. క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతూ టీం ఇండియాలో స్థానం దక్కించుకున్న హనుమ విహారి ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవాడు ? ఇదే ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. జాతీయ క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్న విహారి కాకినాడలో పుట్టి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ టీం ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ విషయం గోదావరి ప్రాంతవాసులకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోంది.
కాకినాడలో జననం
టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్న విహారి పూర్తి పేరు గాదె హనుమ విహారి. 1993 అక్టోబర్ 13న కాకినాడలో జన్మించాడు. తండ్రి సత్యనారాయణ సింగరేణిలో సూపరింటెండెంట్‌గా పని చేస్తుండడంతో పుట్టిన కొద్ది రోజులకే విహారి అక్కడికి వెళ్లిపోయాడు. మూడో తరగతి వరకు గోదావరిఖని, మణుగూరులలోను, ఆ తరువాత హైదరాబాద్‌లోను చదువు కొనసాగించాడు.
స్ఫూర్తి ప్రదాయిని తల్లే
చిన్ననాటి నుంచి విహారి క్రీడలపై ఆసక్తి కనబరిచేవాడు. ఫుట్‌బాల్‌తోపాటు క్రికెట్‌పై మక్కువ చూపేవాడు. తల్లి క్రికెట్‌లో సచిన్, ద్రావిడ్ వంటి క్రీడాకారులు ఎంత కష్టపడి ఉన్నతస్థాయికి చేరుకున్నారో తరచూ చెబుతుండడంతో క్రికెట్‌పై విహారికి మక్కువ పెరగసాగింది. క్రికెట్ పట్ల ఆసక్తి పెరగడంతో బాగా రాణించగలిగాడు. ఏడో ఏట హైదరాబాద్‌లో సెయింట్ జాన్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ కోచ్ జాన్‌మోజెస్ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ పొందాడు.
అనతికాలంలోనే..
క్రికెట్‌లో అనతికాలంలోనే ఉన్నత స్థానానికి విహారి ఎదగగలిగాడు. 2012 అండర్–19 ప్రపంచ కప్ జట్టులో తొలిసారిగా స్థానం పొందాడు. ఆ తరువాత రంజీపోటీల్లో మరింతగా రాణించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 59.45 అత్యధిక సగటుతో ప్రపంచ క్రికెట్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కొనసాగుతున్న విహారి రెండేళ్లుగా తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ టీమ్ ఇండియాలో స్థానం దక్కించుకున్నాడు. ఇక్కడే పుట్టి... ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ టీమ్ ఇండియాలో స్థానం పొందిన తెలుగు రాష్ట్రాల క్రికెట్ క్రీడాకారుల్లో ఎంఎస్‌కే ప్రసాద్ తరువాత విహారే. విహారి ప్రస్తుత తరం క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తాడని, బాలుర, బాలికల జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కేవీఎస్ కామరాజు, కిరణ్‌రాజ్, సంయుక్త కార్యదర్శి కొండలరావు, పీడీ స్పర్జన్‌రాజు ఆనందం వ్యక్తం చేశారు. అంకిత భావంతో తన కుమారుడు చేసిన కృషి ఈ స్థాయికి తెచ్చిందని అతని తల్లి విజయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు.
విహారికి అభినందనల వెల్లువ
భానుగుడి (కాకినాడ సిటీ): ఆంధ్ర రంజీట్రోఫీ లో నిలకడైన ప్రదర్శనకు చక్కటి గుర్తింపు తెచ్చుకుని ఇంగ్లండ్‌లో జరగనున్న చివరి రెండు టెస్ట్‌లకు భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న జిల్లాకు చెందిన ఆటగాడు గాదె హనుమ విహారి అభినందనీయుడని జిల్లా బాలుర, బాలికల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీఎస్‌డీ కామరాజు అన్నారు. జిల్లా బాలుర, బాలికల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో గురువారం కామరాజు అధ్యక్షతన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అండర్ 16 నుంచి నిలకడగా ఆడుతూ జిల్లాకు మంచిపేరు తీసుకువచ్చిన క్రికెట్ క్రీడాకారుడు హనుమ విహారి అని అన్నారు.
సంఘ కార్యదర్శి కేఎస్ కిరణ్‌రాజు మాట్లాడుతూ కాకినాడకు చెందిన విహారి ఇండియా ఏ టీమ్‌లో అద్భుతంగా ఆడాడని, అక్కడ ప్రతిభను గుర్తించి జాతీయ జట్టుకు ఎంపిక చేశారన్నారు. ఆంధ్రా నుంచి టెస్ట్ మ్యాచ్‌కు ఎంపికైన వారిలో ఎంఎస్‌కే ప్రసాద్ తరువాత స్థానం విహారిదే అన్నారు. రంగరాయ మెడికల్ కళాశాల పీడీ డాక్టర్ కె. స్పర్జన్‌రాజు మాట్లాడుతూ క్రికెట్ మీద ఉన్న అంకిత భావంతో ఆడటం వలనే విహారి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడని, జిల్లా సంఘం కూడా విహారికి మంచి ప్రోత్సాహాన్ని అందించిందన్నారు. జిల్లా బాలుర, బాలికల క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మురళీకృష్ణ, జాయింట్ సెక్రటరీ ఐ. కొండలరావు, ట్రెజరర్ వైవీఎస్ నాయుడు, హెడ్ కోచ్‌లు డి. రవికుమార్, ఎమ్వీ నగేష్, ఎన్. రవికుమార్, జీడీ ప్రసాద్, జె.హరినాథరెడ్డి, ఎం. సత్యనారాయణ విహారికి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment