
వరంగల్ స్పోర్ట్స్: భారత టెస్టు క్రికెటర్, హైదరాబాద్ రంజీ జట్టు మాజీ సభ్యుడు, ప్రస్తుత ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ గాదె హనుమ విహారి ఓ ఇంటివాడయ్యాడు. ప్రముఖ డిజైనర్ ప్రీతి రాజ్‌తో విహారి పెళ్లి ఆదివారం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ హంటర్ రోడ్‌లోని కోడెం కన్వెన్షన్ హాల్‌లో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వధువు ప్రీతి రాజ్ వరంగల్ రూరల్ జిల్లా మొగిలిచర్ల సమీపంలోని రెడ్డిపాలెంనకు చెందిన పారిశ్రామికవేత్త రాజేందర్ రెడ్డి కూతురు. విహారి, ప్రీతి రాజ్ క్లాస్‌మేట్స్ కావడంతో పెద్దల అంగీకారంతో వివాహం జరిపించారు. ఈ వేడుకకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.