మురళీ గానం... విరాట్‌ నాదం | Vijay, Kohli , centuries india looking a huse score | Sakshi
Sakshi News home page

మురళీ గానం... విరాట్‌ నాదం

Published Fri, Feb 10 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM

మురళీ గానం... విరాట్‌ నాదం

మురళీ గానం... విరాట్‌ నాదం

సెంచరీలతో చెలరేగిన విజయ్, కోహ్లి
భారత్‌ 356/3
తొలి రోజే బంగ్లాదేశ్‌  డీలా


అనూహ్యం ఏమీ లేదు. స్క్రిప్ట్‌లో తేడా కూడా రాలేదు. టాస్‌ గెలిచిన భారత్‌ తమకు అలవాటైన రీతిలో అద్భుత బ్యాటింగ్‌ను చూపించింది. ముందుగా విజయ్‌ కళాత్మక సెంచరీ... ఆపై కోహ్లి అలవోక శతకం... మధ్యలో అండగా పుజారా... వెరసి తొలి రోజే భారీ స్కోరుతో టీమిండియా ప్రత్యర్థి బంగ్లాదేశ్‌కు సవాల్‌ విసిరింది. ఇదే ఊపు కొనసాగితే రెండో రోజే మ్యాచ్‌ చేతుల్లోకి వచ్చేసే నిర్ణయాత్మక స్థితికి చేరుకోవడం ఖాయం.

ఇటీవల మెరుగుపడిన ఆటతో బంగ్లాదేశ్‌ పోటీ ఇస్తుందని వినిపించిన వ్యాఖ్యలు ఉత్త మాటలేనని తేలిపోయింది. ఆరంభంలో కొద్దిసేపు మినహా ఆ జట్టు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇద్దరు బౌలర్లు పరుగులు ఇవ్వడంలో సెంచరీకి చేరువ కాగా, ఫీల్డింగ్‌ వైఫల్యాలు కూడా జట్టును దెబ్బ తీశాయి. వెరసి భారత గడ్డపై తొలి టెస్టు ఆడుతున్న ఆ జట్టు తొలి రోజే కూలబడిపోయి పరాజయానికి బాటలు పరుచుకున్నట్లే కనిపిస్తోంది.  

హైదరాబాద్‌: బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన ఏకైక టెస్టులో తొలి రోజు భారత్‌ చెలరేగింది. ప్రత్యర్థి బౌలింగ్‌ను చెండాడి భారీ స్కోరు సాధించింది. గురువారం ఆట ముగిసే సమయానికి భారత్‌ 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (141 బంతుల్లో 111 బ్యాటింగ్‌; 12 ఫోర్లు), మురళీ విజయ్‌ (160 బంతుల్లో 108; 12 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీలు సాధించగా.... పుజారా (177 బంతుల్లో 83; 9 ఫోర్లు) ఆ అవకాశం కోల్పోయాడు. కోహ్లితో పాటు రహానే (45 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నాడు. రెండో వికెట్‌కు విజయ్, పుజారా 178 పరుగులు జోడించగా, నాలుగో వికెట్‌కు కోహ్లి, రహానే అభేద్యంగా 122 పరుగులు జత చేశారు. కోహ్లి కెరీర్‌లో ఇది 16వ సెంచరీ కాగా, విజయ్‌కు 9వది.

గత టెస్టులో ‘ట్రిపుల్‌ సెంచరీ’ సాధించిన కరుణ్‌ నాయర్‌ స్థానంలో రహానేను తీసుకున్న భారత్, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగడం విశేషం. భారత గడ్డపై తొలి టెస్టు ఆడుతున్న బంగ్లాదేశ్‌ మెరుగైన రీతిలో మ్యాచ్‌ను ఆరంభించింది. తస్కీన్‌ వేసిన తొలి ఓవర్‌ నాలుగో బంతినే వికెట్లపైకి ఆడుకొని రాహుల్‌ (2) బౌల్డ్‌ కావడంతో బంగ్లా సంబరంలో మునిగింది. ఈ స్థితిలో విజయ్, పుజారా ముందుగా నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యతనిచ్చారు. ఈ క్రమంలో భారత బ్యాట్స్‌మెన్‌ కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్నారు. విజయ్‌ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.  తమకు దక్కిన అవకాశాలను బంగ్లా వృథా చేసుకోగా... విజయ్, పుజారా మరో అవకాశం ఇవ్వకుండా భారీ భాగస్వామ్యానికి బాటలు వేశారు. వికెట్‌ నష్టానికి 86 పరుగుల వద్ద భారత్‌ లంచ్‌కు వెళ్లింది.

లంచ్‌ తర్వాత విజయ్, పుజారా మరింత స్వేచ్ఛగా ఆడారు. కవర్స్‌ దిశగా కొన్ని చక్కటి షాట్‌లను ఆడిన విజయ్‌... షకీబ్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ఫోర్, భారీ సిక్సర్‌ బాదాడు. ఈ క్రమంలో ముందుగా విజయ్‌ 82 బంతుల్లో, అనంతరం పుజారా 108 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే సాఫీగా సాగుతున్న సమయంలో మెహదీ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చిన పుజారా సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. ఆ తర్వాత వచ్చీ రాగానే తొలి మూడు బంతుల్లో 2 ఫోర్లు బాది కోహ్లి దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. భారత్‌ రెండు వికెట్లకు 206 పరుగుల స్కోరుతో టీ విరామానికి వెళ్లింది.

టీ విరామం అనంతరం కొద్ది సేపటికే 149 బంతుల్లో విజయ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 31 పరుగుల వద్ద తైజుల్‌ బౌలింగ్‌లో కోహ్లి ఎల్బీ కోసం బంగ్లా రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. అయితే తైజుల్‌ బౌలింగ్‌లో స్వీప్‌కు ప్రయత్నించి విజయ్‌ అవుట్‌ కావడంతో భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత ఆట ముగిసే వరకు కోహ్లి జోరు కొనసాగింది. అతనికి రహానే నుంచి చక్కని సహకారం లభించింది. మెహదీ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా ఫోర్‌ కొట్టి 130 బంతుల్లోనే కోహ్లి శతకం అందుకున్నాడు. 81 ఓవర్ల తర్వాత బంగ్లా కొత్త బంతి తీసుకున్నా వారికి కలిసి రాలేదు. కొత్త బంతితో వేసిన 9 ఓవర్లలో భారత్‌ 65 పరుగులు రాబట్టడం విశేషం.

టెస్టుల్లో తాను ఆడిన 7 జట్లపై కూడా కోహ్లి సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్‌తో ఇది పూర్తయింది. పాకిస్తాన్, జింబాబ్వేలతో కోహ్లి టెస్టులు ఆడలేదు. ఈ టెస్టు సీజన్‌లో 1,000 పరుగులు కూడా పూర్తి చేసుకున్న కోహ్లి, భారత కెప్టెన్‌గా 9 సెంచరీలతో అజహరుద్దీన్‌తో సమంగా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement