
ఆరో స్థానాన్ని నిలబెట్టుకుంటాం: మాల్యా
న్యూఢిల్లీ: ‘కన్‌స్ట్రక్టర్ చాంపియన్‌షిప్’లో సాబెర్ (45 పాయింట్లు) జట్టు నుంచి ముప్పు పొంచి ఉన్నా.... ప్రస్తుతం ఉన్న ఆరో స్థానాన్ని నిలబెట్టుకుంటామని ఫోర్స్ ఇండియా (62 పాయింట్లు) టీమ్ ప్రిన్సిపల్ విజయ్ మాల్యా ఆశాభావం వ్యక్తం చేశారు. గత రెండు రేసుల్లో టాప్-10లో చోటు దక్కించుకోలేకపోవడం ఫోర్స్ అవకాశాలను బాగా దెబ్బతీయగా... సాబెర్ చివరి నాలుగు రేసుల్లో 38 పాయింట్లు గెలవడం వారికి కలిసొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య తేడా 17 పాయింట్లకు పడిపోయింది.
ఈ సీజన్‌లో మరో నాలుగు రేసులు మిగిలి ఉన్నాయి. ‘2014 సీజన్ కోసం కారును అభివృద్ధి చేసేందుకు చాలా ఖర్చు చేస్తున్నాం. అదే సమయంలో ఈ సీజన్‌లోని మిగతా నాలుగు రేసుల్లో సాబెర్ కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాలి. సిల్వర్‌స్టోన్ రేసులో టైర్లు మార్చాల్సి రావడం దెబ్బతీసింది. దీంతో కారును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. టైర్ల గురించి తెలుసు కాబట్టి ప్రాక్టీస్ సెషన్ ఫలితాలపై సంతృప్తిగానే ఉన్నాం. మిగతా రేసుల్లో రాణించేందుకు ప్రయత్నిస్తాం. ఈ ఏడాది పడిన కష్టం వచ్చే సీజన్‌లో మాకు మంచి పెట్టుబడిగా ఉపయోగపడుతుంది’ అని మాల్యా వ్యాఖ్యానించారు.