'అమీర్ ఖాన్‌తోపోరుకు సిద్ధం'
న్యూఢిల్లీ: అన్ని అనుకూలిస్తే పాకిస్తాన్ సంతతికి చెందిన బ్రిటిష్ బాక్సర్ అమీర్ ఖాన్‌తో తలపడేందుకు తాను సిద్ధమేనని భారత మేటి బాక్సర్ విజేందర్ సింగ్ అన్నాడు. శనివారం రాత్రి ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ బౌట్‌లో తాను సాధించిన అద్భుత విజయాన్ని బాక్సింగ్ గ్రేట్ మొహమ్మద్ అలీకి అంకితమిచ్చిన విజేందర్ ఓ నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు.
‘హోప్‌పై గెలుపుతో నా ర్యాంక్ మెరుగుపడింది. ప్రస్తుతం నేను టాప్-15లో ఉన్నా. కాబట్టి ఇక నుంచి మరింత కఠినమైన బౌట్లలో పాల్గొనాలి. ఇందుకోసం నేనూ సిద్ధంగా ఉన్నా. నా కోచ్, టీమ్‌తో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా. ఇక బ్రిటిష్ బాక్సర్ అమీర్, నా వెయిట్ కేటగిరీల్లో తేడాలున్నాయి. అమీర్ బరువైనా పెరగాలి... లేదంటే నేనైనా తగ్గాలి. అప్పుడే మా ఇద్దరి మధ్య బౌట్ సాధ్యమవుతుంది. నేనైతే అతనితో బౌట్ జరగాలనే కోరుకుంటున్నా. అది కూడా భారత్‌లోనే జరగాలి’ అని విజేందర్ పేర్కొన్నాడు. ప్రస్తుతానికైతే విజేందర్ తర్వాతి బౌట్‌లో కామన్వెల్త్ చాంపియన్ ల్యూక్ బ్లాక్‌లెడ్జ్‌తో తలపడే అవకాశాలున్నాయి.