
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్–జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఆటగాళ్లు చేమల వినయ్, మొహమ్మద్ రయీస్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్‌లో శుక్రవారం జరిగిన 44–46 కేజీల సెమీఫైనల్లో వినయ్ 1–0తో సుమీర్ యాదవ్ (బిహార్)పై గెలుపొందాడు. 46–48 కేజీల సెమీస్‌లో రయీస్ 5–0తో ప్రదీశ్ (తమిళనాడు)ను కంగుతినిపించాడు. మిగతా బౌట్లలో 42–44 కేజీల కేటగిరీలో కె. ఆంజనేయులు 3–0తో శివమ్ కుమార్ (ఉత్తరప్రదేశ్)పై విజయం సాధించగా, 50–52 కేజీల విభాగంలో పిడుగు శ్రీకాంత్ 0–2తో తుశాంత్ టక్రాన్ (ఢిల్లీ) చేతిలో పరాజయం చవిచూశాడు.
32–34 కేజీల కేటగిరీలో బాల గణేష్ రెడ్డి (ఏపీ) 5–0తో సాహిల్ (పశ్చిమ బెంగాల్)పై నెగ్గగా, సత్తారు బలరాం (ఏపీ) 0–2తో ఆకాశ్ పాశ్వాన్ (పశ్చిమ బెంగాల్) చేతిలో కంగుతిన్నాడు. నెల్లి అభిరామ్ (ఏపీ) 1–0తో దుశ్యంత్ (ఛత్తీస్‌గఢ్)పై గెలుపొందగా, భార్గవ్ (ఏపీ) 0–1తో అంకిత్ (ఛత్తీస్‌గఢ్) చేతిలో ఓడిపోయాడు.