న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్ లాంటి మెగా ఈవెంట్‌లు ముందున్న తరుణంలో భారత బాక్సర్లకు సన్నాహకం కోసం ప్రత్యేకంగా విదేశీ పర్యటనలను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు, దిగ్గజ బాక్సర్లపై అవగాహన కోసం ఇటలీ, ఐర్లాండ్, కొరియా దేశాల్లో భారత బాక్సర్లను ప్రాక్టీస్ నిమిత్తం పంపించారు. జూన్ 12 వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం భారత అగ్రశ్రేణి బాక్సర్లు నిఖత్ జరీన్, అమిత్ పంగల్, సిమ్రన్‌జిత్ కౌర్, లవ్లీనా బోర్గోహైన్, శివ థాపా బెల్‌ఫాస్ట్‌లో ఇటలీ జట్టుతో ద్వైపాక్షిక ట్రెయినింగ్ క్యాంపులు, ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో తలపడుతున్నారు. వీరితో పాటు ఆరు యూరోపియన్ దేశాలకు చెందిన బాక్సర్లు కూడా ఈ క్యాంపులో పాల్గొన్నారు.
అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్, రొమేనియా, ఇటలీ, ఐర్లాండ్ వంటి దేశాలకు చెందిన ఎలైట్ బాక్సర్లతో మ్యాచ్‌లకు ఎలా సన్నద్ధం కావాలో అనుభవపూర్వకంగా భారత క్రీడాకారులకు తెలియజెప్పడమే ఈ పర్యటనల ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఇటలీ పర్యటన తమకు గొప్ప అవకాశమని ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత అమిత్ పంగల్ అన్నాడు. ‘రెండు రోజులుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. దిగ్గజ బాక్సర్లను పరిశీలించడానికి ఇది మాకు మంచి అవకాశం. ఇక్కడికి వచ్చాక మానసికంగా, ఆటపరంగా చాలా మెళుకువలు తెలుసుకున్నాం’ అని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment