
నాగ్‌పూర్: తన పునరాగమనానికి సంబంధించి భారత వెటరన్ పేస్ బౌలర్ ఆర్ వినయ్ కుమార్ గత నెల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా జట్టులో తిరిగి చోటు సంపాదించడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశాడు. ఇక్కడ సత్తా ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదంటూ రీ ఎంట్రీపై ఆశలు పెట్టుకున్నఈ కర్ణాటక బౌలర్.. తాజాగా ముంబైతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లతో సత్తా చాటడమే కాకుండా మొత్తంగా ఆరు వికెట్లు సాధించి తనలో చేవ తగ్గలేదని నిరూపించాడు.
రంజీ ట్రోఫీలో భాగంగా నాల్గో కార్టర్ ఫైనల్లో గురువారం ముంబైతో ఆరంభమైన మ్యాచ్‌లో కర్ణాటక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా ఉన్న వినయ్ కుమార్ టాస్ గెలిచిన వెంటనే ప్రత్యర్థి ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు వినయ్ కుమార్ చుక్కలు చూపించాడు. తొలి ఓవర్ చివరి బంతికి ముంబై స్టార్ ఆటగాడు పృథ్వీ షా అవుట్ చేసిన వినయ్ కుమార్..ఆపై మూడో ఓవర్ మొదటి బంతికి జోయ్ గోకుల్ బిస్తా పెవిలియన్‌కు పంపాడు. ఇక తరువాత బంతికి ఆకాశ్ పర్కకర్‌ను ఎల్బీగా పంపి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అటు తరువాత సిద్ధేశ్ లాడ్, అఖిల్ హరిద్వార్, సూర్యకుమార్ యాదవ్‌లు ను వినయ్ కుమార్ అవుట్ చేశాడు. ఇది వినయ్ కుమార్‌కు కర్ణాటక తరపున వందో ఫస్ట్ క్లాస్ కావడం ఇక్కడ మరో విశేషం. వినయ్ కుమార్ దెబ్బకు ముంబై తన తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే చాపచుట్టేసింది. ముంబై జట్టులో ధావల్ కులకర్ణి(75)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధావల్ ఆదుకోవడంతో ముంబై మోస్తరు స్కోరును సాధించింది.
వినయ్ ఘనతలు..
రంజీల్లో వినయ్ కుమార్‌కు ఇది రెండో హ్యాట‍్రిక్. 2007-08 సీజన్‌లో మహారాష్ట్రపై వినయ్ కుమార్ తొలిసారి హ్యాట‍్రిక్ సాధించాడు. కాగా, రంజీ చరిత్రలో అత్యధిక సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన నాల్గో బౌలర్ గా వినయ్ ఘనత నమోదు చేయగా, కర్ణాటక తరపున ఈ ఫీట్ సాధించిన రెండో బౌలర్‌గా వినయ్ నిలిచాడు. రంజీల్లో కర్ణాటక తరపున అత్యధిక సార్లు హ్యాట్రిక్ తీసిన వారిలో వినయ్ కంటే ముందు అనిల్ కుంబ్లే ఉన్నాడు. మరొకవైపు రంజీ ట్రోఫీలో ఒక కర్ణాటక బౌలర్ హ్యాట్రిక్ వికెట్లను తీయడం పదోసారి కాగా, ఈ ఫీట్‌ను సాధించిన తొలి కెప్టెన్‌గా వినయ్ కుమార్ ఘనత సాధించాడు. 2013లో భారత్ తరుపున చివరిసారి కనిపించిన వినయ్ మరొకసారి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. తాను తిరిగి కచ్చితంగా జాతీయ జట్టులోకి వస్తాననే ధీమాతో ఉన్న వినయ్ కుమార్ సెలక్టర్లను ఆకర్షిస్తాడో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment