మైదానం నుంచి పొలాల్లోకి...
భారత ఫుట్‌బాలర్ వినీత్ వ్యవసాయం
కన్నూర్ (కేరళ): అంతర్జాతీయ లేదా దేశవాళీ ఆటగాళ్లు సాధారణంగా విరామం లభించగానే కుటుంబ సభ్యులతో సమయం గడపడానికో లేదంటే ఎక్కడైనా విహారానికి వెళ్లేందుకు ఇష్టపడతారు. కానీ భారత ఫుట్‌బాల్ ఆటగాడు సీకే వినీత్ మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. తన స్వస్థలం కన్నూర్ జిల్లా వెంగాడ్‌లో తండ్రికి సహకరించేందుకు పొలం పనుల్లోకి దిగాడు.
ఏదో సరదా కోసం కాకుండా సాధారణ రైతులా పూర్తి సమయం దానికి కేటాయిస్తూ పంట పండించడంపైనే దృష్టి పెట్టాడు. ‘వ్యవసాయం విషయంలో మా ఇంట్లో ఎవరైనా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. నాన్నకు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది. ఇక్కడ కష్టపడేందుకు వెనుకాడాల్సిన అవసరం లేదు’ అని వినీత్ అన్నాడు. ఐ–లీగ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ తరఫున ఆడి ఆ జట్టు టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్ట్రైకర్/వింగర్ వినీత్ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో గత రెండేళ్లుగా కేరళ బ్లాస్టర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2016 ఐఎస్‌ఎల్‌లో కేరళ ఫైనల్ చేరడంలో ఐదు గోల్స్‌తో వినీత్‌దే ముఖ్య భూమిక.