మొహమ్మదాన్ క్లబ్‌పై 4–0తో గెలుపు
ఐఎస్‌ఎల్ చరిత్రలో నార్త్ ఈస్ట్ నయా రికార్డు
5–0తో జంషెడ్‌పూర్‌పై విజయం
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) తాజా సీజన్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ తొలి విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు 4–0తో మొహమ్మదాన్ స్పోర్ట్స్ క్లబ్‌పై గెలుపొందింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో ఆకట్టుకోలేకపోయిన హైదరాబాద్... మొహమ్మదాన్ క్లబ్‌తో పోరులో చెలరేగి ఆడింది.
అలాన్ డిసౌజా మిరండా (4వ, 15వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో మెరవగా... స్టీఫెన్ సాపిక్ (12వ నిమిషంలో), పరాగ్ శ్రీవాస్ (51వ ని.లో) చెరో గోల్ కొట్టారు. మ్యాచ్ ఆరంభం నుంచే విజృంభించిన హైదరాబాద్ జట్టు... ప్రత్యర్థి డిఫెన్స్ బలహీనతలను సొమ్ము చేసుకుంటూ మ్యాచ్ ఆరంభమైన తొలి 15 నిమిషాల్లోనే మూడు గోల్స్‌తో తిరుగులేని ఆధిక్యం సాధించారు. దీంతో ఒత్తిడికి గురైన మొహమ్మడన్ క్లబ్ ఆటగాళ్లు డిఫెన్స్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.
బంతిని ఎక్కువసేపు అదుపులో పెట్టుకున్న మొహమ్మదాన్ ప్లేయర్లు... హైదరాబాద్ కన్నా ఎక్కువ షాట్‌లు ఆడినా... అవి లక్ష్యాన్ని చేరుకోకుండా మనవాళ్లు అడ్డుపడ్డారు. 60 శాతం బంతిని తమ ఆ«దీనంలో ఉంచుకున్న మొహమ్మడన్ జట్టుకు 13 కార్నర్‌లు, ఒక ఆఫ్‌సైడ్ లభించినా... వాటిని వినియోగించుకోలేకపోయారు. లీగ్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ ఒక విజయం, ఒక ‘డ్రా’, మూడు పరాజయలతో మొత్తంగా 4 పాయింట్లు సాధించి పట్టికలో 11వ స్థానంలో నిలిచింది.
నార్త్ ఈస్ట్ రికార్డు విజయం
గువాహటి వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ 5–0తో జంషెడ్‌పూర్ జట్టుపై గెలిచింది. ఐఎస్‌ఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇప్పటి వరకు ఈ లీగ్‌లో ఒక జట్టు ఐదు గోల్స్ నమోదు చేయడం కూడా ఇదే మొదటిసారి. నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు తరఫున అలాద్దీన్ (5వ, 90వ నిమిషాల్లో), పార్థిబ్ గొగొయ్ (44వ, 55వ నిమిషాల్లో) రెండేసి గోల్స్ చేయగా... లూయిస్ నిక్సన్ (82వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు.
నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టుకు ఇది రెండో గెలుపు కాగా... 8 పాయింట్లతో ఉన్న ఆ జట్టు పట్టికలో ఐదో స్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌లో ఓడిన జంషెడ్‌పూర్ జట్టు ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో ఉంది. ఆదివారం ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment