Indian Footballer
-
సికింద్రాబాద్‌లో పుట్టిన ఛెత్రీ.. ఫుట్‌బాల్ అంటే ప్రాణం! కెప్టెన్ ఫెంటాస్టిక్..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న క్రీడ ఫుట్‌బాల్. ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకు లోకమంతా ఊగిపోతుంది. వ్యక్తిగత ఆర్జనలో, అభిమానంలో కూడా ఆటగాళ్ల స్థాయి ఆకాశమంత ఎత్తున ఉంటుంది. కానీ భారత్‌లో మాత్రం అంతా భిన్నం. ఫుట్‌బాల్ క్రీడకు కనీస గుర్తింపు లేకపోగా దేశం తరఫున ఆడే ఆటగాళ్ల పేర్లు కూడా ఎవరూ చెప్పలేని స్థితి. కానీ ఇలాంటి చోట కూడా తన ఆటతో భారత ఫుట్‌బాల్‌కు ఒకే ఒక్కడు చిరునామాగా మారాడు. జట్టు పరాజయాలు మాత్రమే ప్రధాన దృష్టిని ఆకర్షించే సమయంలో అతని ఆట గురించి అందరూ మాట్లాడుకునేలా చేయగలగడమే ఆ ఆటగాడి ఘనత. ఒక బలహీన జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ కూడా తన అసాధారణ ప్రదర్శనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలగడం అతనికే చెల్లింది. 18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఏ భారత ఆటగాడికీ సాధ్యం కాని ఘనతలు, రికార్డులతో చరిత్ర లిఖించిన ఆ ఆటగాడే సునీల్ ఛెత్రీ. మైదానంలో ఫార్వర్డ్‌గా, భారత జట్టు కెప్టెన్ హోదాలో ఛెత్రీ దాటిన మైలురాళ్లు ఎన్నో! 39 ఏళ్ల వయసులోనూ అమితోత్సాహంతో భారత జట్టును నడిపిస్తూ, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో వంద గోల్స్ కీర్తికి చేరువవుతూ అతను సాగిస్తున్న ప్రస్థానం అసాధారణం. భారత ఫుట్‌బాల్‌కు సంబంధించి మరో మాటలకు తావు లేకుండా ఆల్‌టైమ్ దిగ్గజం అనగలిగే ఆటగాడు ఛెత్రీ. ‘భారత ఫుట్‌బాల్ అభిమానులారా.. మీరంతా పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చి మాకు మద్దతు పలకండి. మైదానంలో ఫ్యాన్స్ అండగా ఉంటే విజయానికి కావలసిన ప్రేరణ లభిస్తుంది. మీరు ఆటకు మద్దతు పలికితేనే భారత్‌లో ఫుట్‌బాల్ స్థాయి పెరుగుతుంది!’ ఎక్కడైనా మనజట్టు కీలక మ్యాచ్ ఆడుతున్న సమయంలో ప్రతిసారీ కెప్టెన్ నుంచి ఇలాంటి విజ్ఞప్తి వస్తూ ఉంటుంది. ఆసియా చాలెంజ్ కప్.. శాఫ్ చాంపియన్‌షిప్.. ఇంటర్ కాంటినెంటల్ కప్.. ఇలా ఏ టోర్నీలో భారత్ ఆడినా సునీల్ ఛెత్రీ అభిమానులను ఉత్సాహపరచే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు తాను ఉన్న స్థితిలో అతనికి దీని వల్ల ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఫుట్‌బాల్‌పై అతనికి ఉన్న అమిత ప్రేమే అందుకు కారణం. భారత్‌లో ఆట స్థాయిని పెంచేందుకు అన్ని రకాలుగా తాము చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటని, అందులో తప్పేమీ లేదనేది అతని భావన. నిజంగానే ఛెత్రీ కారణంగానే గతంతో పోలిస్తే ఇటీవల భారత అభిమానులు కూడా జాతీయ జట్టు ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లపై, వాటి ఫలితాలపై ఆసక్తి చూపిస్తున్నారనేది వాస్తవం. ఫ్యాన్స్‌ను స్టేడియానికి రప్పించగల సత్తా ఒక్క ఛెత్రీకే ఉందనేది కూడా అన్నింటికి మించిన వాస్తవం. తల్లిదండ్రుల నుంచి.. భారత సైన్యంలో కోర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ (సీఈఎంఈ) ఒక భాగం. ఇందులో ఛెత్రీ తండ్రి ఆఫీసర్ హోదాలో పని చేసేవారు. ఆయన భారత ఆర్మీ జట్టు తరఫున ఫుట్‌బాల్ ఆడారు. తల్లి కూడా నేపాల్ ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దాంతో సహజంగానే ఫుట్‌బాల్.. ఛెత్రీ రక్తంలో ఉంది. తండ్రి సికింద్రాబాద్‌లో పని చేస్తున్న సమయంలో ఛెత్రీ పుట్టాడు. సికింద్రాబాద్ ఆర్మీ ఏరియా చుట్టూ ఉండే ఫుట్‌బాల్ వాతావరణం కూడా అతడిని బాగా ఆకర్షించింది. ఆ తర్వాత ఉద్యోగరీత్యా తండ్రి.. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్తూ ఉన్నా.. ఛెత్రీ మాత్రం ఫుట్‌బాల్‌ను వదిలిపెట్టలేదు. స్కూల్ స్థాయి నుంచే పోటీల్లో పాల్గొంటూ వచ్చిన అతను ఆటలో స్టార్ స్థాయికి చేరే వరకూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించాడు. ఢిల్లీలో కుర్రాడిగా స్థానిక లీగ్‌లలో ఆడుతున్నప్పుడు ఫార్వర్డ్ స్థానంలో అందరికంటే భిన్నంగా అద్భుత నైపుణ్యంతో దూసుకుపోయిన ఛెత్రీ ఆటతీరు నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) జట్లను ఆకర్షించింది. అదే అతని కెరీర్‌కు పునాది వేసింది. క్లబ్‌ల తరఫున సత్తా చాటి.. 18 ఏళ్ల వయసులో ఛెత్రీ తొలిసారి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లోకి అడుగు పెట్టాడు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కోల్‌కతాకు చెందిన మోహన్ బగాన్ క్లబ్ ఛెత్రీకి తొలి అవకాశం కల్పించింది. సీజన్లో ఆరు గోల్స్‌తో అతను సత్తా చాటాడు. టీమ్ ముందుకు వెళ్లకపోయినా ఛెత్రీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. దాంతో వరుసగా ఇతర క్లబ్‌ల దృష్టి అతనిపై పడింది. మోహన్‌బగాన్ తర్వాత జేసీటీ, ఈస్ట్ బెంగాల్, డెంపో, చిరాగ్ యునైటెడ్, చర్చిల్ బ్రదర్స్, ముంబై సిటీ, బెంగళూరు.. ఇలా భారత ఫుట్‌బాల్‌లో ప్రత్యేక విలువ ఉన్న, ప్రతిష్ఠాత్మక క్లబ్‌లు అన్నింటికీ ఛెత్రీ ప్రాతినిధ్యం వహించడం విశేషం. అమెరికాకు చెందిన కాన్సస్ సిటీ విజార్డ్స్ క్లబ్, పోర్చుగీస్‌కు చెందిన స్పోర్టింగ్ సీపీ క్లబ్ తరఫునా అతను ఆడాడు. ఎన్ఎఫ్ఎల్తో మొదలు పెట్టి ఐ లీగ్, మేజర్ లీగ్ సాకర్, లిగా ప్రొ, ఇండియన్ సూపర్ లీగ్‌లలో ఆడిన ఛెత్రీ 372 మ్యాచ్‌లలో బరిలోకి దిగి 175 గోల్స్‌తో ఆయా జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. జాతీయ స్థాయి టోర్నీ సంతోష్ ట్రోఫీలో ఛెత్రీ ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగాడు. రికార్డు ప్రదర్శనతో.. క్లబ్ స్థాయిలో ఛెత్రీ ప్రదర్శన జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టి పడేలా చేసింది. దాంతో 2004లో భారత అండర్–20 జట్టులోకి అతను ఎంపికయ్యాడు. నిలకడగా రాణించిన అతను దీనికి కొనసాగింపుగా భారత అండర్–23 టీమ్‌లో కూడా కీలక సభ్యుడిగా నిలిచాడు. 2005.. పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరం.. ఒక గొప్ప ఆటగాడిగా తొలి అడుగుకు వేదికగా నిలిచింది. భారత సీనియర్ జట్టుకు ఛెత్రీ తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు. పాకిస్తాన్‌తో జరిగిన ఈ పోరు డ్రాగా ముగియగా భారత్ తరఫున ఛెత్రీ ఏకైక గోల్ నమోదు చేశాడు. ఆ తర్వాత అతనే భారత ఫుట్‌బాల్‌కు పెద్ద దిక్కుగా మారాడు. టోర్నీ స్థాయి చిన్నదైనా, పెద్దదైనా ఛెత్రీ ఆటతోనే జట్టుపై ఆశలు, అంచనాలు. ఈ క్రమంలో తన నైపుణ్యంతో ఛెత్రీ అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు చెప్పుకోదగ్గ విజయాలు అందించాడు. ఆసియా చాలెంజ్ కప్ (ఒక సారి), శాఫ్ చాంపియన్‌షిప్ (4 సార్లు), నెహ్రూ కప్ (3 సార్లు), ఇంటర్కాంటినెంటల్ కప్ (2 సార్లు), ట్రై నేషన్ సిరీస్ (ఒక సారి).. ఈ టోర్నీల్లో భారత్‌ను విజేతగా నిలపడంతో ఛెత్రీతదే ప్రధాన పాత్ర. ఈ క్రమంలో భారత జట్టుకు ఎక్కువ సార్లు (145) ప్రాతినిధ్యం వహించిన, ఎక్కువ గోల్స్ (93) సాధించిన ఆటగాడిగా ఛెత్రీ నిలిచాడు. వరుస పురస్కారాలతో.. సుదీర్ఘ కాలంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఛెత్రీ ప్రదర్శన అతడిని సహజంగానే అందరికంటే అగ్రస్థానాన, భిన్నంగా నిలబెట్టింది. ఈ క్రమంలో పలు రికార్డులు, అవార్డులు అతని ఖాతాలో చేరాయి. ఏఐఎఫ్ఎఫ్ వార్షిక అత్యుత్తమ ఆటగాడి అవార్డును ఏడుసార్లు గెలుచుకున్న అతను ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మూడు సార్లు గెలుచుకున్నాడు. శాఫ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు సార్లు అతను ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలవగా, లీగ్‌లలో పెద్ద సంఖ్యలో గెలుచుకున్న అవార్డులు వీటికి అదనం. కేంద్ర ప్రభుత్వ పురస్కారాల్లో అర్జున, పద్మశ్రీలను అందుకున్న ఛెత్రీ.. ఖేల్‌రత్న గెలుచుకున్న తొలి ఫుట్‌బాలర్‌గా నిలిచాడు. భారత మాజీ ఆటగాడు సుబ్రతా భట్టాచార్య కుమార్తె సోనమ్ భట్టాచార్యను పెళ్లి చేసుకున్న ఛెత్రీకి ఈ ఏడాది ఆగస్టులో అబ్బాయి పుట్టాడు. భారత జట్టు అంతర్జాతీయ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో వందో స్థానానికి అటూ ఇటూగానే ఉంటూ వచ్చినా ఛెత్రీ ఆటను మాత్రం ఫిఫా ప్రత్యేకంగా గుర్తించింది. 2022 వరల్డ్ కప్‌కు ముందు ఛెత్రీపై ఫిఫా మూడు భాగాల ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించింది. ‘కెప్టెన్ ఫెంటాస్టిక్’ పేరుతో తయారు చేసిన ఈ డాక్యుమెంటరీలో ఛెత్రీ అద్భుత కెరీర్ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ సమర్ బెనర్జీ మృతి
కోల్‌కతా: అలనాటి మేటి ఫుట్‌బాలర్, 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సమర్ ‘బద్రూ’ బెనర్జీ కన్ను మూశారు. 92 ఏళ్ల సమర్ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. హైదరాబాదీ సయ్యద్ అబ్దుల్ రహీమ్ కోచ్‌గా, సమర్ బెనర్జీ కెప్టెన్‌గా మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టుకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత్ 4–2తో ఆస్ట్రేలియాను ఓడించింది. సెమీస్‌లో 1–4తో యుగోస్లావియా చేతిలో ఓడిన భారత్... కాంస్య పతక మ్యాచ్‌లో 0–3తో బల్గేరియా చేతిలో ఓడిపోయింది. దేశవాళీ ఫుట్‌బాల్‌లో విఖ్యాత మోహన్ బగాన్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన సమర్ బెనర్జీ తన క్లబ్ జట్టుకు డ్యూరాండ్ కప్ (1953), రోవర్స్ కప్ (1955)లలో విజేతగా నిలిపారు. జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీలో బెంగాల్ జట్టుకు రెండుసార్లు (1953, 1955) టైటిల్ అందించారు. అనంతరం సమర్ కోచ్‌గా మారి 1962లో బెంగాల్ జట్టు ఖాతాలో మరోసారి సంతోష్ ట్రోఫీని చేర్చారు. -
సునీల్ ఛెత్రీ అరుదైన రికార్డు.. మెస్సీకి రెండు అడుగుల దూరంలో
ఫుట్‌బాల్ స్టార్.. భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ అరుదైన ఘనత సాధించాడు. ఏఎప్సీ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ ఛెత్రీ ఆట 45వ నిమిషంలో గోల్‌తో మెరిశాడు. ఈ గోల్ సునీల్ ఛెత్రీకి 84వ అంతర్జాతీయ గోల్ కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే హంగేరీ ఫుట్‌బాల్ దిగ్గజం ఫెరెన్క్ పుస్కాస్తో సమానంగా టాప్-5లో నిలిచాడు. పుస్కాస్ కూడా హంగేరీ తరపున 84 అంతర్జాతీయ గోల్స్ కొట్టాడు. ఇక టాప్ ఫోర్లో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(117 గోల్స్), ఇరాన్ స్టార్ అలీ దాయి (109 గోల్స్) రెండో స్థానంలో.. మొఖ్తర్ దహరి (89 గోల్స్) మూడో స్థానంలో.. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ 86 గోల్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక మెస్సీకి, సునీల్ ఛెత్రీకి మధ్య గోల్స్ వ్యత్యాసం రెండు మాత్రమే ఉండడం విశేషం. అంతర్జాతీయంగా ఎక్కువ గోల్స్ కొట్టిన టాప్-10 జాబితాలో రొనాల్డో, మెస్సీ, సునీల్ ఛెత్రీ, అలీ మొబ్కూత్(80 గోల్స్, యూఏఈ) మాత్రమే ప్రస్తుతం ఆడుతున్నారు. ఇక ఆసియా కప్ గ్రూప్-డి క్వాలిఫయర్స్‌లో భాగంగా హంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా. ఈ విజయంతో టేబుల్ టాపర్‌గా ఆసియా కప్ 2023 టోర్నీలో ఆడనుంది. ఈ మ్యాచ్‌కి ముందు టేబుల్ టాపర్‌గా ఉన్న హాంకాంగ్‌పై ఆది నుంచి భారత్ ఎదురుదాడికి దిగింది. ఆట రెండో నిమిషంలోనే గోల్ సాధించి, హంగ్ కాంగ్ని ఒత్తిడిలోకి నెట్టేసింది. ఆట ప్రారంభమైన రెండో నిమిషంలో అన్వర్ ఆలీ గోల్ సాధించి, భారత జట్టుకి 1-0 ఆధిక్యం అందించాడు. తొలి సగం ముగుస్తుందనగా ఆట 45వ నిమిషంలో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ గోల్ చేసి టీమిండియాను 2-0 ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత హాంకాంగ్ గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టిన భారత జట్టు.. ఆట 85వ నిమిషంలో మూడో గోల్ చేసింది. మన్వీర్ సింగ్ గోల్‌తో టీమిండియా ఆధిక్యం 3-0కి దూసుకెళ్లింది. నిర్ణీత సమయం అనంతరం ఇచ్చిన అదనపు సమయంలో ఆట 90+3వ నిమిషంలో ఇషాన్ పండిట గోల్ సాధించడంతో భారత జట్టు 4-0 తేడాతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. చదవండి: Asian Cup 2023: భారత ఫుట్‌బాల్ జట్టు కొత్త చరిత్ర.. వరుసగా రెండోసారి -
ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: భారత్ ఫుట్‌బాల్‌లో ‘స్వర్ణయుగం’లాంటి గత తరానికి ప్రతినిధిగా నిలిచిన ఆటగాళ్లలో మరొకరు నిష్క్రమించారు. నగరానికి చెందిన ప్రముఖ ఫుట్‌బాలర్, 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్న సయ్యద్ షాహిద్ హకీమ్ ఆదివారం గుల్బర్గాలో కన్ను మూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. డెంగీ సోకడంలో ఆయనను ఆస్పత్రిలో చేర్చామని, చికిత్స పొందుతుండగానే గుండెపోటుతో హకీమ్ మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత ఏడాది జూలైలో కోవిడ్ బారిన పడిన ఆయన అనం తరం కోలుకున్నారు. భారత ఫుట్‌బాల్‌లో దిగ్గజ కోచ్ అయిన ఎస్ఏ రహీమ్ కుమారుడైన హకీమ్... ఆటకు అందించిన సేవలకుగాను 2017లో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ధ్యాన్‌చంద్ అవార్డు’ అవార్డును కూడా అందుకున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా... తండ్రి రహీమ్ అడుగుజాడల్లో ఫుట్‌బాల్‌లోకి అడుగు పెట్టిన హకీమ్ సుమారు 25 ఏళ్ల పాటు ఆటతో తన అనుబంధాన్ని కొనసాగించారు. హకీమ్ అద్భుత ప్రదర్శనతోనే హైదరాబాద్ జట్టు 1956, 1957 లలో వరుసగా రెండు సార్లు ప్రఖ్యాత సంతోష్ ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. సెంట్రల్ మిడ్‌ఫీల్డర్‌గా, హాఫ్ బ్యాక్ స్థానంలో ఆయన తన ప్రతిభను ప్రదర్శించారు. 1950వ, 60వ దశకాల్లో భారత కీలక ఆటగాడిగా నిలిచిన హకీమ్...1960 రోమ్ ఒలింపిక్స్‌లో ఆరో స్థానంలో నిలిచిన మన టీమ్‌లో భాగంగా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత రిఫరీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన హకీమ్...1989 వరకు 33 అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు. అనంతరం తండ్రి బాటలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన హకీమ్...శిక్షకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన శిక్షణలో మహీంద్రా అండ్ మహీంద్రా జట్టు 1988లో అత్యంత పటిష్టమైన ఈస్ట్ బెంగాల్‌ను ఓడించి ప్రతిష్టాత్మక డ్యురాండ్ కప్‌ను గెలుచుకోవడం హకీమ్ కెరీర్లో మరచిపోలేని ఘట్టం. సాల్గావ్కర్, బెంగాల్ ముంబై ఎఫ్‌సీ జట్లకు కూడా ఆయన కోచ్‌గా వ్యవహరించారు. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఆయన పని చేశారు. ఆపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో రీజినల్, ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా దశాబ్ద కాలం పాటు సేవలందించారు. ఎయిర్‌ఫోర్స్‌లో సుదీర్ఘ కాలం స్క్వాడ్రన్ లీడర్ హోదాలో పని చేసిన హకీమ్ అదే క్రమశిక్షణ, నిజాయితీని అన్ని చోట్లా చూపించేవారు. ఫుట్‌బాలర్లకు మేలు చేసేందుకు ‘ఆఖరి విజిల్’ వరకు పోరాడేందుకు సిద్ధమని చెబుతూ ఉండే హకీమ్...తన ఆటగాళ్లకు సరైన సౌకర్యాలు కల్పించమంటూ ఒక దశలో ‘సాయ్’ అధికారులతో తలపడేందుకు సిద్ధమయ్యారు. దాంతో సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వం ఆయన పెన్షన్, ఇతర సౌకర్యాలనూ నిలిపివేసింది. అయినా తగ్గకుండా తాను నమ్మిన బాటలోనే చివరి వరకు నడిచారు. చదవండి: ఇంగ్లండ్ ఆటగాళ్లు అతి చేస్తుంటే కోచ్ ఏం చేస్తున్నాడు..? -
ఫుట్‌బాలర్ వినీత్‌కు ఉద్యోగం వచ్చింది
తిరువనంతపురం: సరైన హాజరులేని కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యుడు సీకే వినీత్‌కు కేరళ ప్రభుత్వం అండగా నిలిచింది. అతనికి స్పోర్ట్స్ కోటా కింద రాష్ట్ర సచివాలయంలోని అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఆడిటర్‌గా పని చేసిన వినీత్ తన ప్రాక్టీస్, అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా విధులకు సరిగ్గా హాజరు కాలేకపోయాడు. దీంతో అతడిని గతేడాది మేలో కేంద్ర ప్రభుత్వ విధుల నుంచి తొలగించారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని కోరుతూ ముఖ్యమంత్రి విజయన్ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖను కోరినా లాభం లేకపోవడంతో.. అతనికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. -
మైదానం నుంచి పొలాల్లోకి...
భారత ఫుట్‌బాలర్ వినీత్ వ్యవసాయం కన్నూర్ (కేరళ): అంతర్జాతీయ లేదా దేశవాళీ ఆటగాళ్లు సాధారణంగా విరామం లభించగానే కుటుంబ సభ్యులతో సమయం గడపడానికో లేదంటే ఎక్కడైనా విహారానికి వెళ్లేందుకు ఇష్టపడతారు. కానీ భారత ఫుట్‌బాల్ ఆటగాడు సీకే వినీత్ మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. తన స్వస్థలం కన్నూర్ జిల్లా వెంగాడ్లో తండ్రికి సహకరించేందుకు పొలం పనుల్లోకి దిగాడు. ఏదో సరదా కోసం కాకుండా సాధారణ రైతులా పూర్తి సమయం దానికి కేటాయిస్తూ పంట పండించడంపైనే దృష్టి పెట్టాడు. ‘వ్యవసాయం విషయంలో మా ఇంట్లో ఎవరైనా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. నాన్నకు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది. ఇక్కడ కష్టపడేందుకు వెనుకాడాల్సిన అవసరం లేదు’ అని వినీత్ అన్నాడు. ఐ–లీగ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ తరఫున ఆడి ఆ జట్టు టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్ట్రైకర్/వింగర్ వినీత్ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో గత రెండేళ్లుగా కేరళ బ్లాస్టర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2016 ఐఎస్ఎల్లో కేరళ ఫైనల్ చేరడంలో ఐదు గోల్స్‌తో వినీత్‌దే ముఖ్య భూమిక.