ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న క్రీడ ఫుట్‌బాల్. ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకు లోకమంతా ఊగిపోతుంది. వ్యక్తిగత ఆర్జనలో, అభిమానంలో కూడా ఆటగాళ్ల స్థాయి ఆకాశమంత ఎత్తున ఉంటుంది. కానీ భారత్‌లో మాత్రం అంతా భిన్నం. ఫుట్‌బాల్ క్రీడకు కనీస గుర్తింపు లేకపోగా దేశం తరఫున ఆడే ఆటగాళ్ల పేర్లు కూడా ఎవరూ చెప్పలేని స్థితి.
కానీ ఇలాంటి చోట కూడా తన ఆటతో భారత ఫుట్‌బాల్‌కు ఒకే ఒక్కడు చిరునామాగా మారాడు. జట్టు పరాజయాలు మాత్రమే ప్రధాన దృష్టిని ఆకర్షించే సమయంలో అతని ఆట గురించి అందరూ మాట్లాడుకునేలా చేయగలగడమే ఆ ఆటగాడి ఘనత. ఒక బలహీన జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ కూడా తన అసాధారణ ప్రదర్శనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలగడం అతనికే చెల్లింది.
18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఏ భారత ఆటగాడికీ సాధ్యం కాని ఘనతలు, రికార్డులతో చరిత్ర లిఖించిన ఆ ఆటగాడే సునీల్ ఛెత్రీ. మైదానంలో ఫార్వర్డ్‌గా, భారత జట్టు కెప్టెన్ హోదాలో ఛెత్రీ దాటిన మైలురాళ్లు ఎన్నో!
39 ఏళ్ల వయసులోనూ అమితోత్సాహంతో భారత జట్టును నడిపిస్తూ, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో వంద గోల్స్ కీర్తికి చేరువవుతూ అతను సాగిస్తున్న ప్రస్థానం అసాధారణం. భారత ఫుట్‌బాల్‌కు సంబంధించి మరో మాటలకు తావు లేకుండా ఆల్‌టైమ్ దిగ్గజం అనగలిగే ఆటగాడు ఛెత్రీ.
‘భారత ఫుట్‌బాల్ అభిమానులారా.. మీరంతా పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చి మాకు మద్దతు పలకండి. మైదానంలో ఫ్యాన్స్ అండగా ఉంటే విజయానికి కావలసిన ప్రేరణ లభిస్తుంది. మీరు ఆటకు మద్దతు పలికితేనే భారత్‌లో ఫుట్‌బాల్ స్థాయి పెరుగుతుంది!’
ఎక్కడైనా మనజట్టు కీలక మ్యాచ్ ఆడుతున్న సమయంలో ప్రతిసారీ కెప్టెన్ నుంచి ఇలాంటి విజ్ఞప్తి వస్తూ ఉంటుంది. ఆసియా చాలెంజ్ కప్.. శాఫ్ చాంపియన్‌షిప్.. ఇంటర్ కాంటినెంటల్ కప్.. ఇలా ఏ టోర్నీలో భారత్ ఆడినా సునీల్ ఛెత్రీ అభిమానులను ఉత్సాహపరచే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు తాను ఉన్న స్థితిలో అతనికి దీని వల్ల ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదు.
కానీ ఫుట్‌బాల్‌పై అతనికి ఉన్న అమిత ప్రేమే అందుకు కారణం. భారత్‌లో ఆట స్థాయిని పెంచేందుకు అన్ని రకాలుగా తాము చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటని, అందులో తప్పేమీ లేదనేది అతని భావన.
నిజంగానే ఛెత్రీ కారణంగానే గతంతో పోలిస్తే ఇటీవల భారత అభిమానులు కూడా జాతీయ జట్టు ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లపై, వాటి ఫలితాలపై ఆసక్తి చూపిస్తున్నారనేది వాస్తవం. ఫ్యాన్స్‌ను స్టేడియానికి రప్పించగల సత్తా ఒక్క ఛెత్రీకే ఉందనేది కూడా అన్నింటికి మించిన వాస్తవం.
తల్లిదండ్రుల నుంచి..
భారత సైన్యంలో కోర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ (సీఈఎంఈ) ఒక భాగం. ఇందులో ఛెత్రీ తండ్రి ఆఫీసర్ హోదాలో పని చేసేవారు. ఆయన భారత ఆర్మీ జట్టు తరఫున ఫుట్‌బాల్ ఆడారు. తల్లి కూడా నేపాల్ ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దాంతో సహజంగానే ఫుట్‌బాల్.. ఛెత్రీ రక్తంలో ఉంది.
తండ్రి సికింద్రాబాద్‌లో పని చేస్తున్న సమయంలో ఛెత్రీ పుట్టాడు. సికింద్రాబాద్ ఆర్మీ ఏరియా చుట్టూ ఉండే ఫుట్‌బాల్ వాతావరణం కూడా అతడిని బాగా ఆకర్షించింది. ఆ తర్వాత ఉద్యోగరీత్యా తండ్రి.. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్తూ ఉన్నా.. ఛెత్రీ మాత్రం ఫుట్‌బాల్‌ను వదిలిపెట్టలేదు.
స్కూల్ స్థాయి నుంచే పోటీల్లో పాల్గొంటూ వచ్చిన అతను ఆటలో స్టార్ స్థాయికి చేరే వరకూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించాడు. ఢిల్లీలో కుర్రాడిగా స్థానిక లీగ్‌లలో ఆడుతున్నప్పుడు ఫార్వర్డ్ స్థానంలో అందరికంటే భిన్నంగా అద్భుత నైపుణ్యంతో దూసుకుపోయిన ఛెత్రీ ఆటతీరు నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) జట్లను ఆకర్షించింది. అదే అతని కెరీర్‌కు పునాది వేసింది.
క్లబ్‌ల తరఫున సత్తా చాటి..
18 ఏళ్ల వయసులో ఛెత్రీ తొలిసారి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లోకి అడుగు పెట్టాడు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కోల్‌కతాకు చెందిన మోహన్ బగాన్ క్లబ్ ఛెత్రీకి తొలి అవకాశం కల్పించింది. సీజన్‌లో ఆరు గోల్స్‌తో అతను సత్తా చాటాడు. టీమ్ ముందుకు వెళ్లకపోయినా ఛెత్రీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. దాంతో వరుసగా ఇతర క్లబ్‌ల దృష్టి అతనిపై పడింది.
మోహన్‌బగాన్ తర్వాత జేసీటీ, ఈస్ట్ బెంగాల్, డెంపో, చిరాగ్ యునైటెడ్, చర్చిల్ బ్రదర్స్, ముంబై సిటీ, బెంగళూరు.. ఇలా భారత ఫుట్‌బాల్‌లో ప్రత్యేక విలువ ఉన్న, ప్రతిష్ఠాత్మక క్లబ్‌లు అన్నింటికీ ఛెత్రీ ప్రాతినిధ్యం వహించడం విశేషం.
అమెరికాకు చెందిన కాన్సస్ సిటీ విజార్డ్స్ క్లబ్, పోర్చుగీస్‌కు చెందిన స్పోర్టింగ్ సీపీ క్లబ్ తరఫునా అతను ఆడాడు. ఎన్‌ఎఫ్‌ఎల్‌తో మొదలు పెట్టి ఐ లీగ్, మేజర్ లీగ్ సాకర్, లిగా ప్రొ, ఇండియన్ సూపర్ లీగ్‌లలో ఆడిన ఛెత్రీ 372 మ్యాచ్‌లలో బరిలోకి దిగి 175 గోల్స్‌తో ఆయా జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. జాతీయ స్థాయి టోర్నీ సంతోష్ ట్రోఫీలో ఛెత్రీ ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగాడు.
రికార్డు ప్రదర్శనతో..
క్లబ్ స్థాయిలో ఛెత్రీ ప్రదర్శన జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టి పడేలా చేసింది. దాంతో 2004లో భారత అండర్–20 జట్టులోకి అతను ఎంపికయ్యాడు. నిలకడగా రాణించిన అతను దీనికి కొనసాగింపుగా భారత అండర్–23 టీమ్‌లో కూడా కీలక సభ్యుడిగా నిలిచాడు. 2005.. పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరం.. ఒక గొప్ప ఆటగాడిగా తొలి అడుగుకు వేదికగా నిలిచింది.
భారత సీనియర్ జట్టుకు ఛెత్రీ తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు. పాకిస్తాన్‌తో జరిగిన ఈ పోరు డ్రాగా ముగియగా భారత్ తరఫున ఛెత్రీ ఏకైక గోల్ నమోదు చేశాడు. ఆ తర్వాత అతనే భారత ఫుట్‌బాల్‌కు పెద్ద దిక్కుగా మారాడు. టోర్నీ స్థాయి చిన్నదైనా, పెద్దదైనా ఛెత్రీ ఆటతోనే జట్టుపై ఆశలు, అంచనాలు. ఈ క్రమంలో తన నైపుణ్యంతో ఛెత్రీ అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు చెప్పుకోదగ్గ విజయాలు అందించాడు.
ఆసియా చాలెంజ్ కప్ (ఒక సారి), శాఫ్ చాంపియన్‌షిప్ (4 సార్లు), నెహ్రూ కప్ (3 సార్లు), ఇంటర్‌కాంటినెంటల్ కప్ (2 సార్లు), ట్రై నేషన్ సిరీస్ (ఒక సారి).. ఈ టోర్నీల్లో భారత్‌ను విజేతగా నిలపడంతో ఛెత్రీతదే ప్రధాన పాత్ర. ఈ క్రమంలో భారత జట్టుకు ఎక్కువ సార్లు (145) ప్రాతినిధ్యం వహించిన, ఎక్కువ గోల్స్ (93) సాధించిన ఆటగాడిగా ఛెత్రీ నిలిచాడు.
వరుస పురస్కారాలతో..
సుదీర్ఘ కాలంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఛెత్రీ ప్రదర్శన అతడిని సహజంగానే అందరికంటే అగ్రస్థానాన, భిన్నంగా నిలబెట్టింది. ఈ క్రమంలో పలు రికార్డులు, అవార్డులు అతని ఖాతాలో చేరాయి.
ఏఐఎఫ్‌ఎఫ్ వార్షిక అత్యుత్తమ ఆటగాడి అవార్డును ఏడుసార్లు గెలుచుకున్న అతను ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మూడు సార్లు గెలుచుకున్నాడు. శాఫ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు సార్లు అతను ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలవగా, లీగ్‌లలో పెద్ద సంఖ్యలో గెలుచుకున్న అవార్డులు వీటికి అదనం.
కేంద్ర ప్రభుత్వ పురస్కారాల్లో అర్జున, పద్మశ్రీలను అందుకున్న ఛెత్రీ.. ఖేల్‌రత్న గెలుచుకున్న తొలి ఫుట్‌బాలర్‌గా నిలిచాడు. భారత మాజీ ఆటగాడు సుబ్రతా భట్టాచార్య కుమార్తె సోనమ్ భట్టాచార్యను పెళ్లి చేసుకున్న ఛెత్రీకి ఈ ఏడాది ఆగస్టులో అబ్బాయి పుట్టాడు.
భారత జట్టు అంతర్జాతీయ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో వందో స్థానానికి అటూ ఇటూగానే ఉంటూ వచ్చినా ఛెత్రీ ఆటను మాత్రం ఫిఫా ప్రత్యేకంగా గుర్తించింది. 2022 వరల్డ్ కప్‌కు ముందు ఛెత్రీపై ఫిఫా మూడు భాగాల ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించింది. ‘కెప్టెన్ ఫెంటాస్టిక్’ పేరుతో తయారు చేసిన ఈ డాక్యుమెంటరీలో ఛెత్రీ అద్భుత కెరీర్ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది.
-మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment