ముంబై బోణీ | Mumbai City Football Club first win in ISL | Sakshi
Sakshi News home page

ముంబై బోణీ

Published Sun, Oct 20 2024 4:18 AM | Last Updated on Sun, Oct 20 2024 4:18 AM

Mumbai City Football Club first win in ISL

గోవాపై 2–1తో గెలుపు 

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ 

మార్‌గావ్‌: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో ముంబై సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ తొలి విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో ముంబై జట్టు 2–1 తేడాతో గోవా ఫుట్‌బాల్‌ క్లబ్‌పై విజయం సాధించింది. గోవాపై ముంబైకిది వరుసగా 13వ విజయం కావడం విశేషం. ముంబై జట్టు తరఫున నికోస్‌ కరెలిస్‌ (21వ నిమిషంలో), యోల్‌ వ్యాన్‌ నిఫ్‌ (40వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేయగా... గోవా జట్టు తరఫున ఆర్మాండో సాడికు (55వ నిమిషంలో) ఏకైక గోల్‌ సాధించాడు. 

తొలి అర్ధభాగంలోనే రెండు గోల్స్‌తో అదరగొట్టిన ముంబై సిటీ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లగా... గోవా జట్టు వెనుకబడిపోయింది. ద్వితీయార్ధంలో పుంజుకొని పోరాడే ప్రయత్నం చేసినా ఒక గోల్‌తోనే సరిపెట్టుకుంది. తాజా సీజన్‌లో ముంబై సిటీ జట్టు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా... ఇదే తొలి విజయం ఒక ఓటమి, రెండు ‘డ్రా’లతో మొత్తంగా 5 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ముంబై జట్టు పట్టికలో ఏడో స్థానంలో ఉంది. 

మరోవైపు ఐదు మ్యాచ్‌లు ఆడిన గోవా ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఒక విజయం రెండు పరాజయాలు, రెండు ‘డ్రా’లతో 5 పాయింట్లతో ముంబై తర్వాతి స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్‌ జట్టు 2–0తో ఈస్ట్‌ బెంగాల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌పై విజయం సాధించింది. మోహన్‌ బగాన్‌ తరఫున జెమీ మెక్‌లారెన్‌ (41వ నిమిషంలో), దిమిత్రీ పెట్రాటోస్‌ (89వ నిమిషంలో) చెరో గోల్‌ చేశారు. 

ఈ విజయంతో మోహన్‌ బగాన్‌ జట్టు మూడో గెలుపు నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఈస్ట్‌ బెంగాల్‌ జట్టు పట్టిక అట్టడుగున ఉంది. లీగ్‌లో భాగంగా ఆదివారం మొహమ్మదాన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌తో కేరళ బ్లాస్టర్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ తలపడనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement