ముంబై : భారత క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభోత్సవ వేడుకులను బీసీసీఐ రద్దు చేసింది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ కార్యక్రమానికయ్యే ఖర్చును పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు అందజేస్తామని బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ ప్రకటించారు.
మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే 14 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్‌ని బీసీసీఐ మూడు రోజుల క్రితం విడుదల చేసింది. అయితే ఈ ఏడాది ప్రారంభోత్సవానికి బదులుగా ఆ డబ్బుని పుల్వామా దాడిలో అసువులు బాసిన అమర జవాన్ల కుటుంబాలకి అందజేయాలని బీసీసీఐ పాలకుల కమిటీ నిర్ణయించింది.
వాస్తవానికి అమర జవాన్ల కుటుంబాలకి రూ. 5 కోట్లు తగ్గకుండా బీసీసీఐ తరఫున ఆర్థిక సాయం అందించేందుకు అనుమతించాలని వినోద్ రాయ్‌కి బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా లేఖ రాశాడు. దీనిపై ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో చర్చించిన బోర్డు సభ్యులు.. అంతకంటే ఎక్కువ మొత్తాన్నే ఇచ్చేందుకు అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment