అతను చాలా ప్రమాదకరమైన క్రికెటర్!
యంగ్స్టర్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దూకుడు మీద ఉండటం.. ధోనీ సేన మీద చాలా ఆశలు రేపుతోందని అంటున్నాడు భారత క్రికెటర్ యూసఫ్ పఠాన్. మరోసారి పొట్టికప్పును ధోనీ సేన కైవసం చేసుకొని చరిత్ర తిరగరాస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2007లో టీ-20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలోఈ ఆల్‌రౌండర్ కూడా సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా ధోనీ సేన ఫామ్, యువత, అనుభజ్ఞులతో జట్టు మంచి సమతుల్యంతో ఉందని, దీనికితోడు స్వదేశంలో వరల్డ్ కప్ ఆడుతుండటం టీమిండియాకు కలిసొచ్చే విషయమని యూసఫ్ పఠాన్ విశ్లేషించాడు. ఇటీవల ఆస్ట్రేలియా, శ్రీలంక సిరీస్‌లలో, ఆసియా కప్‌లో భారత్ అద్భుతమైన ఆటతీరు కనబర్చిందని కొనియాడాడు. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో నిస్సందేహంగా ఇండియానే ఫేవరెట్ జట్టు అని, ఈ మెగా టోర్నమెంటులో డాషింగ్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ భారత జట్టుకు స్టార్ ఫర్ఫార్మెర్లుగా నిలువనున్నారని పేర్కొన్నాడు.
'టీ20 ఫార్మెట్‌లో కోహ్లి చాలా ప్రమాదకరమైన క్రికెటర్. అతని ఆటతీరు చూడటం నిజంగా కనులకు పండుగే. రోహిత్, కోహ్లి ఇద్దరు ప్రమాదకరమైన ఆటగాళ్లే. తమదైన శైలిలో ఆడుతూ.. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించగలరు' అని పఠాన్ పేర్కొన్నాడు. 33 ఏళ్ల యూసఫ్ పఠాన్ ప్రస్తుతం జట్టులో లేకపోవడం నిరాశ కలిగిస్తున్నదని చెప్పాడు. భవిష్యత్తులో జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.