
ఆతిథ్య ఆసీస్ తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగే తుది జట్టును ప్రకటించగా..
అడిలైడ్ : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ గురువారం అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆతిథ్య ఆసీస్ టెస్ట్ కెప్టెన్ టీమ్ పైన్ తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగే తుది జట్టును ప్రకటించగా.. భారత సారథి విరాట్ కోహ్లి మాత్రం 12 మంది ఆటగాళ్ల పేర్లను వెల్లడించాడు. ఆరో స్థానం కోసం రోహిత్, విహారి మధ్య పోటీ ఉంటుందని ఈ సందర్భంగా కోహ్లి చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యల ప్రకారం విహారి కన్నా రోహిత్‌కే ఎక్కువ అవకాశాలున్నట్లు అర్థమవుతోంది.
ఇక ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు ఉద్వాసన పలికింది. అతని స్థానంలో దేశవాలి క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన హాండ్స్‌కోంబ్‌ను ఎంపిక చేసింది. గత కొంత కాలంగా మార్ష్ నిలకడగా ఆడటం లేదని, అందుకే అతణ్ని ఎంపిక చేయలేదని పైన్ పేర్కొన్నాడు. మిచెల్ మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడేనని, అతడి సేవలు ఈ సిరీస్‌లో ఎదో ఒక సమయంలో అవసరమవుతాయని చెప్పుకొచ్చాడు. ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్‌పై కూడా నమ్మకంగా ఉన్నట్లు తెలిపాడు. ఓపెనర్ ఫించ్‌కు జోడీగా అరంగేట్ర ఆటగాడు హారిస్ బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. ఆసీస్ గడ్డపై సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించాలని కోహ్లి సేన భావిస్తుండగా.. సొంత గడ్డపై గెలిచి ప్రపంచకప్ ముందు గాడీలో పడాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది.
12 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టు: మురళి విజయ్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, అజింక్య రహానె, హనుమ విహారి, రిషభ్ పంత్, రవి చంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ, జస్ర్పిత్ బుమ్రా.
ఆస్ట్రేలియా తుది జట్టు: మార్కస్ హారిస్, ఆరొన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజ, షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, పీటర్ హాండ్స్‌కంబ్, టిమ్ పైన్(కెప్టెన్), జాస్ హజల్‌వుడ్, పాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్.