
విరాట్ కోహ్లి
కోహ్లి బ్యాట్ నుంచి వరుసగా మూడో సెంచరీ..
పుణె: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే అతను మానవమాత్రుడిలా కనిపించడం లేదని కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ నోట వచ్చిన మాట. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో కోహ్లి తాజాగా చేసిన శతకాన్ని చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తోంది. స్విచ్ వేయగానే యంత్రం పని చేయడం ప్రారంభించినట్లు కోహ్లి శతకాలు బాదేస్తున్నాడు. తొలి రెండు వన్డేల్లో సెంచరీలతో చెలరేగిన కోహ్లి.. మూడో వన్డేలోను తన జోరును కొనసాగిస్తూ.. వరుసగా మూడో సెంచరీ సాధించాడు.110 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్స్‌తో కెరీర్‌లో 38వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఫుల్ ఫామ్‌లో ఉన్న కోహ్లిని ఆపడం విండీస్ బౌలర్ల నుంచి కావడం లేదు.
మరోవైపు కోహ్లి మినహా మిగతా టాపార్డర్ బ్యాట్స్‌మన్ రోహిత్(8), ధావన్ (35), రాయుడు (22), పంత్ (24), ధోని(7)లు విఫలమయ్యారు. దీంతో భారత్ 194 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోహ్లి ఒక్కడే బాధ్యతనంతా తన భుజాలపై వేసుకోని గెలుపు కోసం పోరాడుతున్నాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లితో పాటు భువనేశ‍్వర్ ఉన్నాడు.