2008 ఆగస్టు 18, దంబుల్లా... చమిందా వాస్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న మూడో బంతిని థర్డ్‌మ్యాన్ దిశగా పంపించడంతో వన్డే క్రికెట్‌లో తొలి పరుగు.
2018 అక్టోబర్ 24, విశాఖపట్నం... ఆష్లే నర్స్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో వన్డే క్రికెట్‌లో పది వేల పరుగులు పూర్తి.
సాక్షి క్రీడావిభాగం :నాటి నుంచి నేటి వరకు సాగిన 3,720 రోజుల కోహ్లి ప్రస్థానం వన్డే క్రికెట్‌ను మరింత కొత్తగా ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రతీ పరుగు కొత్త రికార్డుకు నాంది పలికింది. లెక్కలేనన్ని మైలురాళ్లు ఈ ప్రయాణంలో పలకరించాయి. ఒకనాడు ‘దేవుడికి మాత్రమే’ సాధ్యమని భావించిన ఘనతలు కొత్త దేవుడి ముందు రెక్కలు విప్పుకుంటూ వచ్చి వాలాయి. 1000, 2000, 3000... ఇలా ఆగకుండా సాగిన పరుగుల తృష్ణ ఇంకా తీరనే లేదు. సెంచరీలు, అర్ధ సెంచరీలు, ఫోర్లు, సిక్సర్లు దాసోహమంటున్నా ఆ వరదకు అడ్డుకట్ట పడటం లేదు. భారీ లక్ష్యాలను ఛేదించడం అంటే గొప్ప గొప్ప ఆటగాళ్లకు కూడా కాలి నడకన కొండెక్కినంత శ్రమ.! కానీ ఇలాంటి సవాల్ సమయంలోనే అతనిలోని వేటగాడు ప్రత్యర్థి పని పడతాడు. తూనికలు, కొలతలు వేసినట్లు అచ్చం లెక్కలు కట్టి పరుగులు చేస్తూ విజయం దరిచేరే వరకు విశ్రమించడు. అసలు ఎలాంటి బలహీనతే లేని ఆటగాడి బలం గురించి ఏం చెబుతాం! మైదానంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు ఎక్కడైనా ఎలాంటి షాట్‌నైనా ఆడగల బ్యాట్స్‌మన్ శైలి గురించి ప్రత్యేకంగా ఎలా మాట్లాడగలం! విరాట్ కోహ్లిని ఎవరితోనూ పోల్చలేం.
గణాంకాలు చూస్తే మరి కొందరి ఘనతలు విరాట్ తరహాలో ఉండవచ్చు. కానీ ఆటంటే అంకెలు మాత్రమే కాదు. సింగిల్ తీసినా, సిక్సర్ కొట్టినా తనలో కనిపించే కసి అందరికంటే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఎన్ని పరుగులు చేసినా, ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా ఎక్కడా తగ్గని తత్వం కోహ్లిని ‘కింగ్’ను చేసింది. ఆ గట్టు, ఈ గట్టు తేడా లేకుండా ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికావరకు ఆగకుండా సాగుతున్న ఆ పరుగుల జోరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫిట్‌నెస్‌కు కొత్త అర్థం చెబుతూ ఇంకా ఇంకా సాధించాలనే తపనే అతడిని పదేళ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రతిష్టాత్మక మైలురాయిని చేరేలా చేసింది. తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగినా, ఆ తర్వాత అత్యుత్తమ ప్రదర్శనతో ‘వరల్డ్ బెస్ట్ నంబర్–3’గా కోహ్లి ఎదిగాడు. వన్డేల్లో విరాట్ వీర ప్రదర్శనను వర్ణిం చేందుకు మాటలు సరిపోవు... అతను చూపించిన అద్భుతాల గురించి చెప్పాలంటే కొత్త కొత్త విశేషణాలు డిక్షనరీలో వెతుక్కోవాల్సిందే. 10 వేల క్లబ్‌లో చేరిన 13వ ఆటగాడికి తర్వాతి లక్ష్యం 18,426 (సచిన్) పరుగులను దాటడమే అనడంలో అతిశయోక్తి లేదు.
►మ్యాచ్‌లు: 213
►ఇన్నింగ్స్‌లు : 205
►నాటౌట్‌లు : 36
►పరుగులు : 10,076
►అత్యధిక స్కోరు : 183
►సగటు : 59.62
►ఆడిన బంతులు : 10,851 స్ట్రయిక్‌రేట్ : 92.85
►సెంచరీలు : 37
►అర్ధ సెంచరీలు : 48
►డకౌట్‌లు : 12
►ఫోర్లు : 944
►సిక్సర్లు : 110
►ఫోర్లు, సిక్సర్ల ద్వారా కోహ్లి చేసిన మొత్తం పరుగులు: 3776 + 660 = 4436
విరాట్ కోహ్లి పరుగుల జోరు (ఇన్నింగ్స్‌ల సంఖ్య)
►1000 – 24
►2000 – 53
►3000 – 75
►4000 – 93
►5000 – 114
►6000 – 136
►7000 – 161
►8000 – 175
►9000 – 194
►10000 – 205
(9 వేల నుంచి 10 వేలకు చేరేందుకు కోహ్లికి కేవలం 11 ఇన్నింగ్స్‌లు మాత్రమే పట్టడం విశేషం. ఒక క్యాలెండర్ ఏడాదిలో ఇంతకంటే వేగంగా ఎవరూ 1000 పరుగులు సాధించలేదు)
10 వేల పరుగుల జాబితా
1. సచిన్ (భారత్) 18,426
2. సంగక్కర (శ్రీలంక) 14,234
3. పాంటింగ్ (ఆస్ట్రేలియా) 13,704
4. జయసూర్య (శ్రీలంక) 13,430
5. జయవర్ధనే (శ్రీలంక) 12,650
6. ఇంజమామ్ (పాకిస్తాన్) 11,739
7. కలిస్ (దక్షిణాఫ్రికా) 11,579
8. గంగూలీ (భారత్) 11,363
9. ద్రవిడ్ (భారత్) 10,889
10. లారా (వెస్టిండీస్) 10,405
11. దిల్షాన్ (శ్రీలంక) 10,290
12. ధోని (భారత్) 10,143
Comments
Please login to add a commentAdd a comment