
విరాట్ కోహ్లి, రోహిత్‌శర్మ
లీడ్స్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఐదో సెంచరీతో భారత్ ఏడో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి... తన వైస్‌కెప్టెన్ రో‘హిట్‌మ్యాన్’ను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఐదు శతకాల ఆటతీరుపై స్పందన ఏంటని కోహ్లి అడిగితే ‘క్రికెటర్‌గా మేం గతాన్ని పట్టించుకోం. ప్రస్తుతం జరిగేదే మాకవసరం. ఇప్పుడు నేనూ అదే చేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితి, ఫామ్ కొనసాగడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాను. బ్యాటింగ్‌లో జట్టును ఇలా ముందుండి నడిపించాలని ఆశిస్తున్నా. ఈ ప్రపంచకప్ ముఖ్యమైన టోర్నమెంట్. ఇందులో జట్టు రాణించడం బాగుంది. ఓ టాపార్డర్ బ్యాట్స్‌మన్‌గా, ఓపెనర్‌గా నా బాధ్యతేంటో నాకు తెలుసు. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ కొట్టాక... ఇకపై కూడా ఇలాంటి ప్రదర్శనే కనబరచాలని భావించాను’ అని అన్నాడు.
ఈ సీజన్ ఐపీఎల్ సందర్భంగా ముంబై సహచరుడు, సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తనతో పంచుకున్న అనుభవాలు, ఇచ్చిన సూచనలే తన రాణింపునకు దోహదం చేశాయని మరోవైపు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ‘యువీ నాకు పెద్దన్నలాంటివాడు. మేం ఎప్పుడు మాట్లాడుకున్నా క్రికెట్ గురించే! 2011 ప్రపంచకప్‌లో తను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో నాకు వివరించాడు. ఓపిగ్గా ఆడటంపై దృష్టిపెట్టాలని సూచించాడు. ఇవన్నీ నాకిపుడు బాగా ఉపయోగపడ్డాయి’ అని రోహిత్ అన్నాడు.
రోహిత్ ఉరకలెత్తిస్తాడు : బ్యాటింగ్ కోచ్
ఈ ప్రపంచకప్‌లో అదేపనిగా శతక్కొట్టే ప్రదర్శనతో దూసుకెళ్తున్న ఓపెనర్ రోహిత్ శర్మను భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ప్రశంసలతో ముంచెత్తాడు. ‘రోహిత్ ఆటతీరు, నిలకడైన ప్రదర్శన అద్భుతం. బరిలోకి దిగిన ప్రతీసారి అదే పట్టుదలతో ఆడుతున్నాడు. ఈ క్రమంలో తన పరుగులకే పరిమితం కాకుండా జోడీ కట్టిన రెండో ఓపెనర్‌నూ ఉరకలెత్తిస్తున్నాడు. ఆసీస్‌తో జరిగిన పోరులో శిఖర్ ధావన్‌ను అలాగే ఉత్సాహపరిచాడు. ఇప్పుడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ను పరుగుపెట్టించాడు. దీంతో తదుపరి బ్యాట్స్‌మెన్‌కు బ్యాటింగ్ తేలికవుతోంది. ఇలా జట్టు మొత్తానికి ఉపయోగపడేలా రోహిత్ ఇన్నింగ్స్‌లు సాగుతున్నాయి. అతని ఆటతీరుతో జట్టు కూడా నిలకడైన విజయాలతో దూసుకెళ్తోంది’ అని అన్నాడు.
భారత్ సెమీస్ ప్రత్యర్థి న్యూజిలాండ్ కాగా దీనిపై స్పందించిన బంగర్... టీమిండియా తమ ఆటతీరుపైనే దృష్టి పెట్టింది కానీ ప్రత్యర్థి ఎవరనే దానిపై కాదని అన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా కనబరిచిన ప్రదర్శనను సెమీఫైనల్లోనూ కొనసాగించాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ప్రత్యర్థి జట్టు బలహీనతలపై దృష్టిపెట్టకుండా తమ జట్టు బలాన్నే నమ్ముకున్నామని బంగర్ అన్నాడు
Comments
Please login to add a commentAdd a comment