'విరాట్ కు పరుగుల బాకీ ఉంది'
రాంచీ: తమతో జరిగిన రెండు టెస్టుల్లో విఫలమైన టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి తదుపరి టెస్టుల్లో పరుగుల దాహాన్ని తీర్చుకునే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. వచ్చే టెస్టులపై విరాట్ సీరియస్ గా దృష్టి సారించి పరుగుల బాకీని తీర్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నాడు. ఈ సిరీస్ ను తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన క్లార్క్.. కడవరకూ హోరాహోరీ పోరు ఖాయంగా పేర్కొన్నాడు. స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్స్ రూమ్ రివ్యూ వివాదం దాదాపు సద్దుమణగడంతో ఇరు జట్లు మూడో టెస్టుపై సీరియస్ గా దృష్టి నిలుపుతాయని క్లార్క్ తెలిపాడు. ఈ మేరకు ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో అనేక విషయాల్ని క్లార్క్ షేర్ చేసుకున్నాడు.
'రాంచీ టెస్టులో విరాట్ పరుగుల దాహాన్ని తీర్చుకునే అవకాశం ఉంది. ఈ సిరీస్ లో ఇంకా ఆకట్టుకోని కోహ్లి.. మూడో టెస్టులో చెలరేగే అవకాశం ఉంది. వచ్చే టెస్టులో గెలుపు ఇరు జట్లకు కీలకం. దాంతో రసవత్తర పోరు ఖాయం. అయితే మేమే సిరీస్ ను మాత్రం గెలుస్తాం. ఎప్పుడూ ఆసీస్కే నా మద్దతు. వారి విజయాల్నే నేను చూడాలనుకుంటా. ఇప్పుడు కూడా అదే జరగాలని కోరుకుంటున్నా. ఈ సిరీస్ ను ఆసీస్ 2-1తో గెలిచే అవకాశం ఉంది' అని క్లార్క్ జోస్యం చెప్పాడు. ఇదిలా ఉంచితే విరాట్ కోహ్లిపైనే ఆసీస్ జట్టు ఎక్కువ ఫోకస్ చేసిందన్న దానితో క్లార్క్ విబేధించాడు. అది కేవలం విరాట్ పట్ల అప్రమత్తంగా ఉండటమే తప్పితే, అతనిపై ఫోకస్ పెట్టడం ఎంతమాత్రం కాదన్నాడు.