
పరీక్షకు సిద్ధం భారత కెప్టెన్ కోహ్లి
ఢాకా: భారత జట్టుకు సారథిగా వ్యవహరించడం పెద్ద పరీక్ష అని, దానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆసియాకప్‌లో జట్టు కెప్టెన్ కోహ్లి చెప్పాడు. పూర్తిస్థాయి బాధ్యతలకు, తాత్కాలిక బాధ్యతలకు తేడా ఉంటుందన్నాడు. ‘నేను కేవలం ఒక టోర్నీకి మాత్రమే సారథిని. తాత్కాలిక బాధ్యతలు, పూర్తిస్థాయి బాధ్యతలకు చాలా తేడా ఉంది. గతంలో నాకప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాను.
కాబట్టే మళ్లీ నాకు అవకాశం వచ్చింది. గెలిస్తే అంతా పొగుడుతారు, లేదంటే విమర్శిస్తారు. ఈ రెండింటికి సిద్ధమై ఉండాలి’ అని కోహ్లి అన్నాడు. తనపై ఎలాంటి ఒత్తిడీ లేదన్నాడు. పాక్‌తో మ్యాచ్ గురించి ప్రత్యేక ఆలోచన లేదన్నాడు. ‘ఆడిన ప్రతీ మ్యాచ్‌లో గెలవడమే మా లక్ష్యం. పాకిస్థాన్‌తో మ్యాచ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. దాయాదితో మ్యాచ్ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుంది’ అన్నాడు. ఆసియాకప్ ఆడేందుకు కోహ్లి బృందం ఆదివారం ఢాకా చేరింది.
ఒక్కటి గెలిస్తే ‘రెండు’
ఆసియాకప్‌లో భారత్ కనీసం ఒక్క లీగ్ మ్యాచ్ గెలిచినా ఈ ఏడాది ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌ను నిలబెట్టు కుంటుంది.