
ముంబై: టెస్టు, వన్డే, టి20 ఇలా ఏ ఫార్మాట్‌లోనైనా అత్యుత్తమంగా దూసుకెళ్తోన్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి సామాజిక మాధ్యమాల ద్వారా సంపాదనలోనూ కోట్లు కొల్లగొడుతున్నాడు. ఎంతలా అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అతను ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన ఫొటో పోస్ట్ చేస్తే అక్షరాలా 82 లక్షలు అందుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా ఆర్జిస్తోన్న వారి జాబితాను హోపర్స్ హెచ్‌క్యూ సంస్థ విడుదల చేయగా క్రీడాకారుల జాబితాలో 9వ స్థానంలో నిలిచిన కోహ్లి... ఓవరాల్‌గా 17వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో టాప్–10లో ఉన్న ఏకైక క్రికెటర్ కోహ్లినే కావడం విశేషం.
ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌ను దాదాపు 2 కోట్ల 30 లక్షల మంది అభిమానులు అనుసరిస్తున్నారు. ఈ ఫాలోవర్ల సంఖ్య కారణంగా తమ కంపెనీ ఉత్పత్తికి సంబంధించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటే కోహ్లికి స్పాన్సర్లు పెద్ద మొత్తంలో ముట్టచెబుతున్నారు. క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉండగా... నెమార్, మెస్సీ, బెక్‌హామ్, గ్యారెత్ బేల్, ఇబ్రహిమోవిచ్, సురెజ్, మెక్‌గ్రెగర్ (ఫైటర్)లు తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు. బాస్కెట్‌బాల్ ప్లేయర్ స్టీఫెన్ కరీ పదో స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment