
కోహ్లి, మిథాలీ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, మహిళల సారథి మిథాలీ రాజ్ ప్రఖ్యాత క్రికెట్ మేగజైన్ ‘విజ్డెన్’ పురస్కారాలకు ఎంపికయ్యారు. విరాట్‌ను వరుసగా రెండో ఏడాది ‘విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్’ అవార్డుకు ఎంపిక చేశారు. అతనికి గతేడాదీ ఈ పురస్కారం దక్కింది. ఇలా రెండేళ్లు వరుసగా పురస్కారాలు అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఇంతకుముందు మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ (2008, 2009) రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. మహిళల క్రికెట్‌లో అనితర సాధ్యమైన అర్ధ సెంచరీలు, పరుగులు సాధించిన మిథాలీ ‘లీడింగ్ విమెన్ క్రికెటర్’గా నిలిచింది. గత ఏడాది మహిళల ప్రపంచకప్‌లో ఆమె సారథ్యంలోని భారత్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్ టీనేజ్ సంచలనం రషీద్ ఖాన్ ‘ఫార్‌మోస్ట్ టి20 ప్లేయర్’ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఐదు విజ్డెన్ రెగ్యులర్ అవార్డులకు ఇవి అదనం. ఈ ఐదు పురస్కారాలకు ఈ సారి ముగ్గురు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు అన్య ష్రబ్‌సోల్, హీతెర్ నైట్, నట్ సివెర్‌లు... ఇద్దరు పురుష క్రికెటర్లు షై హోప్ (విండీస్), జెమీ పోర్టర్ (ఎస్సెక్స్ కౌంటీ జట్టు) ఎంపికయ్యారు. తొలిసారిగా ముగ్గురు మహిళా క్రికెటర్లు ‘విజ్డెన్’ జాబితాలో చోటు సంపాదించుకోవడం ఒక విశేషమైతే... ఓ మహిళ (అన్య ష్రబ్‌సోల్) విజ్డెన్ ముఖచిత్రంలో ఉండటం ఇదే మొదటిసారి.
ఎవరూ చేయని, చేరని పరుగుల ఘనత కోహ్లిది
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 2017లో మూడు ఫార్మాట్లలో చేసిన పరుగులు 2818. ఇతని సమీప క్రికెటర్ జో రూట్ (ఇంగ్లండ్) కంటే 700 పరుగులు ముందున్నాడు. టెస్టుల్లో ఒక్క ఏడాదే మూడు డబుల్ సెంచరీలు చేశాడు. ఇంకా రెండు సెంచరీలూ ఉన్నాయి. వన్డేల్లో మరో రెండు అజేయ శతకాలు బాదాడు. మరోవైపు మిథాలీ రాజ్ (6299) మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన, అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్‌గా నిలిచింది. వరుసగా ఏడు అర్ధసెంచరీల రికార్డునూ గతేడాదే నెలకొల్పింది.
Comments
Please login to add a commentAdd a comment