కోహ్లికి గంగూలీ కీలక సలహా
బెంగళూరు: ఐపీఎల్-10లో వరుస పరాజయాలతో చతికిలపడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పుంజుకోవాలంటే చాలా ఆడాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సలహాయిచ్చాడు. ప్లేఆఫ్ అవకాశాలను ఇప్పటికే క్లిష్టంగా మార్చుకున్న కోహ్లి సేన మరింత శ్రమించాలని సూచించాడు. వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ ను ఆడించాలని, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ను తప్పించాలని అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ మళ్లీ పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.
‘ఆర్సీబీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో గేల్ లాంటి ఆటగాడు జట్టుకు చాలా అవసరం. అతడిని బెంచ్ కే పరిమితం చేయరాదు. గేల్ ను మళ్లీ ఆడించాలి. ఆల్ రౌండర్ అని వాట్సన్ ను ఆడిస్తున్నారు. కానీ అతడు పెద్దగా రాణించలేదు. బ్యాటింగ్ ఆర్డర్ లోనూ మార్పులు చేయాలి. డివిలియర్స్ ను ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దింపితే ఫినిషర్ గా ఉపయోగపడతాడు. ఈ విధంగా చేయడం వల్లే గత సీజన్ లో ఆర్సీబీ సత్తా చాటింద’ ని గంగూలీ పేర్కొన్నాడు. గత సీజన్ లో తాను ఆడిన చివరి 7 లీగ్ మ్యాచుల్లో ఆరింట్లో గెలిచి ఆర్సీబీ ప్లేఆప్ చేరిందని, అదేవిధంగా ఇప్పుడు పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ సీజన్ లో ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడిన ఆర్సీబీ ఒక్కటి మాత్రమే గెలిచింది. రాజ్‌కోట్ ఈ రోజు జరిగే మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ తో ఆర్సీబీ తలపడనుంది.