అది కెప్టెన్ గా చాలా కష్టం: కోహ్లి
బెంగళూరు: ఇటీవల రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరిగిన మ్యాచ్ లో ఎదురైన ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లి. ఆ తరహా ప్రదర్శనను ఎప్పుడూ చూడకూడదని అనుకుంటున్నట్లు కోహ్లి ఆవేదన వ్యక్తం చేశాడు. ఏ ఒక్క ఆటగాడు సంతృప్తికర ప్రదర్శన చేయకపోవడం చాలా బాధించిందన్నాడు.
'ఒక కెప్టెన్ గా ఆ తరహా ప్రదర్శనను జీర్ణించుకోవడం చాలా కష్టం. అటువంటి ప్రదర్శనల గురించి మాట్లాడటానికి కూడా ఏమీ ఉండదు. ఆ మ్యాచ్ మేము ఎలా ఓడిపోయామో అంతా చూశారు. ఈ సీజన్ ప్రదర్శన నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మేము ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నాం. పది మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ లు గెలిస్తే ప్లే ఆఫ్ కు ఎలా వెళతాం. ఇక మిగిలిన గేమ్లను ఎంజాయ్ చేస్తూ ఆడటం మాత్రమే మా పని. ఇక నుంచైనా గెలుపు కోసం శ్రమిస్తే మంచిది. మేము గెలవడం కంటే ఓడిపోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లున్నాం. అందుకే వరుస ఓటములు'అని కోహ్లి అసహనం వ్యక్తం చేశాడు.
రైజింగ్ పుణెతో జరిగిన మ్యాచ్ లో కోహ్లి సేన 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పుణె నిర్దేశించిన 158 పరుగుల సాధారణ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆర్సీబీ పూర్తిగా చేతులెత్తేసింది.ఆర్సీబీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసి ఓటమి పాలైంది. పది మంది సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఆర్సీబీ ఘోర ఓటమిని ఎదుర్కొంది.