విరాట్ కోహ్లి మినహా..
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ ను ఘనంగా ఆరంభించాడు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లి. శుక్రవారం ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ద్వారా తొలి మ్యాచ్ ఆడుతున్న విరాట్(62;47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లి తొలుత ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. క్రీజ్ లో కుదురుకున్న తరువాత కోహ్లి తనదైన శైలిలో్ బ్యాట్ ఝుళిపించాడు. ప్రధానంగా ముంబై బౌలర్ టిమ్ సౌథీ వేసిన మూడో ఓవర్ లో్ విరాట్ దూకుడుగా ఆడాడు. ఆ ఓవర్ తొలి బంతిని సిక్స్ కొట్టిన కోహ్లి..ఆ తరువాత మూడు, నాలుగు బంతుల్ని ఫోర్లుగా మలచాడు. ఆ ఓవర్ లో 17 పరుగులు పిండుకుని ఆర్సీబీ స్కోరు బోర్డులో వేగం పెంచాడు. ఆపై ఆడపా దడపా బౌండరీలు సాధిస్తూ రన్ రేట్ ను కాపాడుకుంటూ వచ్చాడు.
అయితే క్రిస్ గేల్(22) తొలి వికెట్ గా అవుటైన తరువాత కోహ్లి కాస్త నెమ్మదించాడు. కాగా, బూమ్రా వేసిన 14 ఓవర్ మూడో బంతిని డివిలియర్స సిక్స్ కొట్టగా, ఆ తరువాత ఐదు, ఆరు బంతుల్ని సిక్సర్, ఫోర్లుగా మలచాడు కోహ్లి.ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తరువాత కోహ్లి రెండో వికెట్ గా అవుటయ్యాడు.ఆపై స్వల్ప విరామాల్లో బెంగళూరు వికెట్లను చేజార్చుకోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. బెంగళూరు ఆటగాళ్లలో ఏబీ డివిలియర్స్ (19), కేదర్ జాదవ్(9), మన్ దీప్(0)లు నిరాశపరిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కు బెంగళూరు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లీన్ గన్ రెండు వికెట్లు సాధించగా,హర్ధిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.