విరాట్ కోహ్లి మండిపాటు
బెంగళూరు: ఈ సీజన్ ఐపీఎల్లో వరుస ఓటములతో నాకౌట్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న రాయల్ చాలెంజర్స్ ప్రదర్శన పట్ల ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గురువారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన తరువాత కోహ్లి అసహనం కట్టలు తెచ్చుకుంది. ఏదొక మ్యాచ్ లో ఆర్సీబీ గాడిలో పడక పోతుందా?అని ఇప్పటివరకూ వేచి చూసిన కోహ్లికి ఆటగాళ్ల ప్రదర్శన అస్సలు సంతృప్తినివ్వలేదు. దాంతో జట్టు సభ్యులపై కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రతీసారి ఇద్దరు-ముగ్గురు ఆటగాళ్ల ప్రదర్శనతో మ్యాచ్ లు గెలవాలేమని విషయం తెలుసుకోవాలంటూ చురకలంటించాడు. ఎప్పుడైనా సమష్టి ప్రదర్శన అనేది గెలుపుకు ముఖ్యమని, దాని కోసం శ్రమించకపోతే ఇదే తరహాలో మరిన్ని ఓటములు చూడాల్సి వస్తుందంటూ మండిపడ్డాడు.
'ఎప్పుడూ పాజిటివ్ క్రికెట్ను ఆడితేనే విజయాలను సొంతం చేసుకుంటాం. ప్రదర్శనలు ఇంత చెత్తగా ఉంటే ఓటములు వెంటాడతాయి. గేమ్లను కోల్పోవడం కూడా ఎప్పుడూ సులభం కాదు. రాత్రి ఓటమి గురించి మాత్రమే మాట్లాడటం లేదు.. అంతకుముందు కూడా మా జట్టు పరిస్థితి ఇలానే ఉంది. గెలవాలనే కసి ఆటగాళ్లలో కనిపించడం లేదు. ఒకరిద్దరు చలవతో మ్యాచ్ లు గెలవడం పదే పదే సాధ్యం కాదు. సమష్టి కృషి అవసరం. గుజరాత్ చాలా బాగా ఆడింది. మా కంటే అన్ని విభాగాల్లో బాగా రాణించారు కాబట్టే ఆ జట్టు గెలిచింది'అని కోహ్లి పేర్కొన్నాడు.