విరాట్ కోహ్లి ఆవేదన
కోల్ కతా: చెత్త బ్యాటింగ్ కారణంగానే చిత్తుగా ఓడిపోయామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. తాము దారుణంగా ఆడామని వాపోయాడు. అత్యల్ప స్కోరు నమోదు చేయడాన్ని ఖండించాడు. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 49 పరుగులకే కుప్పకూలి 82 పరుగులతో పరాజయం పాలైంది. ఘోరంగా ఓడిపోవడంపై వ్యాఖ్యానించడానికి మాటలు కూడా రావడం లేదని మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి అన్నాడు.
‘చాలా వరస్ట్ గా బ్యాటింగ్ చేశాం. ఇది చాలా బాధించింది. లక్ష్యాన్ని ఛేదింగలమని అనుకున్నాం. నిర్లక్ష్యపు బ్యాటింగ్ కొంప ముంచింది. ఈ సమయంలో ఇంతకుమించి చెప్పలేను. ఘోరంగా ఓడిపోయాం. ఇది ఆమోదయోగ్యం కాదు. ఈ ఓటమిని త్వరగా మార్చిపోయి మళ్లీ పుంజుకోవాలని భావిస్తున్నాం. మాది ఇప్పటికీ అత్యుత్తమ జట్టే. గత మ్యాచ్ లో 200 పైచిలుకు పరుగులు సాధించాం. ఈ ఓటమితో ప్రతి ఒక్కరు రియలైజ్ అవుతారని అనుకుంటున్నాను. ఈ షాక్ నుంచి బయటపడి ఎవరికి వారు సత్తా చాటాలని కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ లో మళ్లీ ఇటువంటి చెత్త ప్రదర్శన చేయబోమని హామీయిస్తున్నాన’ని కోహ్లి అన్నాడు.
ఐపీఎల్-10లో ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడిన ఆర్సీబీ కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉంది.