'ఆ స్థానం కోహ్లిదే'
మెల్బోర్న్: భారత టెస్టు కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ ప్రశంసల వర్షం కురిపించాడు. నిలకడైన ఆట తీరుతో పరుగుల వరద పారిస్తున్న కోహ్లి తనదైన మార్కును సృష్టించుకున్నాడని కొనియాడాడు. భారత క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తరువాత స్థానం కచ్చితంగా విరాట్దేనన్నాడు. విరాట్ ఫిట్ నెస్ను కాపాడుకుంటే సచిన్ సరసన నిలవడం ఖాయమన్నాడు. సమకాలీన క్రికెట్లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ల మాత్రమే కోహ్లికి పోటీగా నిలుస్తారని హస్సీ అభిప్రాయపడ్డాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి బ్యాట్ తో మెరుస్తున్న ఈ ముగ్గురి ఆటను చూడటాన్ని తాను ఎక్కువ ఇష్టపడతానన్నాడు.
ఈ సీజన్ ఐపీఎల్‌లో కోహ్లి 865 పరుగులు నమోదు చేసి ఎవరీకి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇందులో నాలుగు సెంచరీలుండటం విశేషం. ప్రపంచ క్రికెట్ లో ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిటి లిఖించుకున్న కోహ్లి.. ఐపీఎల్లో బెంగళూరుకు అద్భుతమైన విజయాలను సాధించి పెడుతూ అటు కెప్టెన్ గా, ఇటు ఆటగాడిగా ప్రశంసలందుకుంటున్నాడు.