కాస్కో కోహ్లి.... | Virat Kohli praises David Warner ahead of IPL final | Sakshi
Sakshi News home page

కాస్కో కోహ్లి....

Published Sat, May 28 2016 9:59 PM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

కాస్కో కోహ్లి....

కాస్కో కోహ్లి....

సవాల్ విసురుతున్న వార్నర్
నేడు ఐపీఎల్ ఫైనల్
బెంగళూరుతో హైదరాబాద్ ఢీ
తొలి టైటిల్‌పై ఇరు జట్ల కన్ను
 

ఇద్దరూ ఇద్దరే...బ్యాట్‌కు అలుపన్నదే లేకుండా రికార్డు స్థాయిలో పరుగుల ప్రవాహం సాగించింది ఒకరు... అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించింది మరొకరు... ఆశలు లేని స్థితినుంచి జట్టును ఆఖరి మెట్టు వరకు ఒకరు తీసుకొస్తే... అంతా తానై నడిపించింది మరొకరు. ఐపీఎల్-9లో బ్యాట్స్‌మన్‌గానే కాకుండా నాయకులుగా కూడా తమదైన ముద్ర చూపించిన విరాట్ కోహ్లి, డేవిడ్ వార్నర్ ఇప్పుడు చివరిసారి అమీతుమీకి సిద్ధమయ్యారు.

టోర్నీ ఆసాంతం మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా నిలిచిన కోహ్లికి ఇప్పుడు వార్నర్ రూపంలో సవాల్ ఎదురుగా నిలిచింది. మ్యాచ్ బెంగళూరు, హైదరాబాద్ మధ్యే అయినా తొలిసారి తమ జట్టుకు టైటిల్ అందించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్న ఈ ఇద్దరు స్టార్లలో ఎవరిది పైచేయి కానుందో!

 
 
బెంగళూరు: ఐపీఎల్‌లో గతంలో రెండుసార్లు ఫైనల్‌కు చేరినా ఓటమితో వెనుదిరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓవైపు... తమ నాలుగో సీజన్‌లో తుది పోరుకు అర్హత సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోవైపు... టోర్నీలో చాంపియన్‌గా నిలిచేందుకు ఇరు జట్లు అస్త్ర శస్త్రాలతో సన్నద్ధమయ్యాయి.  నేడు (ఆదివారం) ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐపీఎల్-9 ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచి తొలి క్వాలిఫయర్‌లో విజయం అనంతరం బెంగళూరు ఫైనల్లోకి ప్రవేశించింది. మరోవైపు గ్రూప్ దశలో మూడో స్థానంలో నిలిచిన అనంతరం... ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్‌లలో గెలిచి రైజర్స్ ముందంజ వేసింది. ప్రధానంగా తమ బ్యాటింగ్‌పై ఆధారపడుతున్న ఆర్‌సీబీ, బౌలర్లపై ఎక్కువగా నమ్మకముంచిన సన్ జట్ల మధ్య హోరాహోరీ పోరుకు అవకాశం ఉంది.


ఒకరిని మించి మరొకరు
ఐపీఎల్ ఆరంభం సీజన్ నుంచి బెంగళూరు జట్టు ఎన్నో గొప్ప మ్యాచ్‌లు గెలిచింది. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆటగాళ్లు అలరించారు. కానీ టైటిల్ మాత్రం దక్కలేదు. ఈ సారి ఆ జట్టు బ్యాటింగ్ మరింత విధ్వంసకరంగా మారింది. విరాట్ కోహ్లి ఏకంగా 919 పరుగులతో లీగ్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. తన ప్రియమైన గ్రౌండ్‌లో అతడిని ఆపడం చాలా కష్టం. కోహ్లి విఫలమైనా జట్టుకు ఏమీ కాదని గత మ్యాచ్‌లో డివిలియర్స్ చూపించగా... క్రిస్‌గేల్ కుదురుకుంటే ఎంత ప్రమాదకరమో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముగ్గురితో పాటు కేఎల్ రాహుల్ కూడా దూకుడుగా ఆడుతుండగా, అవకాశం దక్కినప్పుడు వాట్సన్, బిన్నీ ఆకట్టుకున్నారు.

అచ్చొచ్చిన సొంత మైదానంలో ఇంత బలమైన లైనప్ చెలరేగిపోతే ఆకాశమే హద్దు కానుంది. 15 ఓవర్ల మ్యాచ్‌లో కూడా 200కు పైగా పరుగులు నమోదైన చిన్నస్వామి స్టేడియంలో మరోసారి అలాంటి మెరుపులకు అవకాశం ఉంది. బెంగళూరు బౌలింగ్ అద్భుతంగా లేకపోయినా... లీగ్ సాగిన కొద్దీ వారంతా నిలదొక్కుకోవడంతో కోహ్లి తన వ్యూహాలతో మంచి ఫలితం రాబట్టగలిగాడు. లెగ్ స్పిన్నర్ చహల్ మరోసారి కీలకం కానున్నాడు.  


వార్నర్‌కు అండగా నిలుస్తారా..?
ప్రత్యర్థి బ్యాటింగ్‌తో పోలిస్తే రైజర్స్ సరితూగడం లేదు. డేవిడ్ వార్నర్ (779 పరుగులు) దూకుడైన బ్యాటింగే ఆ జట్టును ముందుకు నడిపించింది.  శిఖర్ ధావన్ (473) ఫర్వాలేదనిపించినా...అతని బ్యాటింగ్ సహజశైలికి భిన్నంగా (117 స్ట్రైక్‌రేట్) సాగడంతో జట్టుకు మెరుపు ఆరంభం లభించలేదు. వీరిద్దరు జతగా చెలరేగితే సన్ భారీస్కోరుకు అవకాశం ఉంటుంది. రెండు మ్యాచ్‌లలో ఆకట్టుకున్న యువరాజ్ సింగ్ ఫైనల్లో గొప్ప ఇన్నింగ్స్ ఆడాలని సన్ ఆశిస్తోంది. అయితే రైజర్స్ బలమైన బౌలింగ్ జట్టు నమ్మకాన్ని నిలబెట్టింది. 23 వికెట్లతో పర్పుల్ క్యాప్‌తో ఉన్న భువనేశ్వర్ పవర్‌ప్లేలో చెలరేగితే మ్యాచ్ ఫలితాన్ని శాసించగలడు. ఇన్నింగ్స్ చివర్లో కూడా భువీ యార్కర్లతో చెలరేగిపోతున్నాడు. గత మ్యాచ్ ఆడని ముస్తఫిజుర్ గాయంనుంచి కోలుకోవాలని జట్టు కోరుకుంటోంది. ప్రత్యర్థిని పూర్తిగా కట్టి పడేస్తున్న ముస్తఫిజుర్‌తో భువీ జత కలిస్తే రైజర్స్ అద్భుతాలు చేయవచ్చు. బరీందర్, బిపుల్ కూడా ఫర్వాలేదనిపిస్తున్నారు.
 
 
 తాజా ఫామ్
గత ఎనిమిది మ్యాచ్‌లలో బెంగళూరు ఏడు గెలిచింది. ఇందులో వరుసగా ఆరు విజయాలు వచ్చాయి. మరో వైపు సన్ గత 8 మ్యాచ్‌లలో 5 గెలిచింది. గ్రూప్‌లో చివరి ఆరు మ్యాచ్‌లలో 3 గెలిచి, 3 ఓడిన సన్‌రైజర్స్ అనంతరం ఎలిమినేటర్, క్వాలిఫయర్ నెగ్గింది. అయితే గత రెండు మ్యాచ్‌లు ఫైనల్ వేదికకు పూర్తిగా భిన్నమైన ఢిల్లీ పిచ్‌పై ఆడటం కొంత ప్రతికూలాంశం.
 
 
చెరో మ్యాచ్‌లో...

లీగ్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరొకటి నెగ్గాయి. తమ సొంత వేదికపై మ్యాచ్‌ను జట్లు కాపాడుకున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లలో కోహ్లి 75, 14 పరుగులు చేయగా... వార్నర్ 58, 92 పరుగులతో పైచేయి సాధించాడు. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన 8 మ్యాచ్‌లలో కోహ్లి 3 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో పాటు ఒకసారి డకౌటయ్యాడు.
 
గతం...
2009 ఐపీఎల్ ఫైనల్లో నాటి హైదరాబాద్ జట్టు డెక్కన్ చార్జర్స్ చేతిలో, 2011 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో బెంగళూరు ఓడింది. సన్‌రైజర్స్ 2013లో ఐపీఎల్‌లో ప్రవేశించి ప్లేఆఫ్ చేరగా, తర్వాతి రెండు సీజన్లు టాప్-4లో నిలవడంలో విఫలమైంది.
 
 
 తుది జట్ల వివరాలు (అంచనా)

 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి (కెప్టెన్), గేల్, డివిలియర్స్, రాహుల్, వాట్సన్, బిన్నీ, సచిన్ బేబీ, జోర్డాన్, అబ్దుల్లా, అరవింద్,  చహల్.

సన్‌రైజర్స్ హైదరాబాద్: వార్నర్ (కెప్టెన్), ధావన్, హెన్రిక్స్, యువరాజ్, హుడా, కటింగ్, ఓజా, భువనేశ్వర్, బిపుల్, బరీందర్, బౌల్ట్/ముస్తఫిజుర్
 
 పిచ్, వాతావరణం

చిన్నస్వామి స్టేడియం ఐపీఎల్‌లో పరుగుల ప్రవాహానికి చిరునామా. గత మ్యాచ్‌లో అనూహ్యంగా బౌలింగ్‌కు అనుకూలించినా... ఫైనల్‌కు మాత్రం మళ్లీ బ్యాటింగ్ వికెట్ సిద్ధంగా ఉంది.ఆదివారం  చిరు జల్లులకు అవకాశం ఉంది. ఒకవేళ వర్షంతో ఏదైనా సమస్య ఎదురైనా సోమవారం ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement