10,000 | Virat Kohli Reaches 10000 Runs | Sakshi
Sakshi News home page

10,000

Published Thu, Oct 25 2018 1:34 AM | Last Updated on Thu, Oct 25 2018 1:36 AM

Virat Kohli Reaches 10000 Runs - Sakshi

ఐదంకెల మార్క్‌ను అందుకునే క్రమంలో...

► అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో (205) పది వేల పరుగుల మైలురాయిని చేరిన ఆటగాడిగా కోహ్లి కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు సచిన్‌ టెండూల్కర్‌ (259 ఇన్నింగ్స్‌) పేరిట ఈ ఘనత ఉంది. సచిన్‌కంటే 54 ఇన్నింగ్స్‌లు అతను తక్కువగా ఆడటం విశేషం. 205 ఇన్నింగ్స్‌లు ముగిసేసరికి కోహ్లి తర్వాత డివిలియర్స్‌ మాత్రమే గరిష్టంగా 9,080 పరుగులు చేయడం విరాట్‌ ఆధిపత్యాన్ని చూపిస్తోంది.  

అరంగేట్రం చేసిన నాటి నుంచి అతి తక్కువ రోజుల్లో 10 వేలు మైలురాయిని చేరింది కూడా కోహ్లినే. అతను 10 ఏళ్ల 67 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. ద్రవిడ్‌కు ఈ ఘనత సాధించేందుకు 10 ఏళ్ల 317 రోజులు పట్టింది.  

10 వేల కోసం ఎదుర్కొన్న బంతులను చూసినా కోహ్లిదే రికార్డు. జయసూర్య 11,296 బంతులు ఆడితే కోహ్లికి 10,813 మాత్రమే సరిపోయాయి.  

 పిన్న వయసులో 10 వేల పరుగులు పూర్తి చేసిన జాబితాలో కోహ్లి రెండో స్థానంలో నిలిచాడు. అతను 29 ఏళ్ల 353 రోజుల వయసులో ఈ మైలురాయి చేరుకోగా, సచిన్‌  27 ఏళ్ల 341 రోజుల్లోనే ఈ ఘనత సాధించాడు.  

10 వేల పరుగులు పూర్తి చేసే సమయానికి అత్యధిక సగటు (59.53) కోహ్లిదే. ధోని మినహా మరెవరూ 50కి పైగా సగటుతో ఈ మైలురాయిని చేరలేదు.  

కోహ్లి ఒక్క భారత గడ్డపైనే 78 ఇన్నింగ్స్‌లలో 4,127 పరుగులు చేయగా, మిగతా ఎనిమిది దేశాలలో కలిపి 127 ఇన్నింగ్స్‌లలో 5,949 పరుగులు చేశాడు.  

భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు కోహ్లి పేరిటే ఉంది. 2013లో ఆస్ట్రేలియాతో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో అతను 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 52 బంతుల్లోనే శతకం బాదాడు.  

 కెరీర్‌లో అత్యధికంగా 153 మ్యాచ్‌లలో మూడో స్థానంలో బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లి 1, 2, 4, 5, 6, 7 స్థానాల్లో కూడా ఆడాడు.  

వన్డేల్లో అఫ్గానిస్తాన్, యూఏఈలతో ఒక్కో మ్యాచ్‌ ఆడిన కోహ్లి... ఈ రెండు దేశాలు మినహా తాను ప్రత్యర్థిగా ఆడిన ప్రతీ జట్టుపై సెంచరీ సాధించాడు. అఫ్గాన్‌తో బ్యాటింగ్‌కు దిగని కోహ్లి, యూఏఈపై అజేయంగా 33 పరుగులు చేశాడు. ఇదే కాకుండా తాను ఆడిన 9 దేశాల్లోనూ అతను శతకాలు సాధించాడు.  

భారత జట్టు గెలిచిన 128 మ్యాచ్‌లలో భాగంగా ఉన్న కోహ్లి ఆ మ్యాచ్‌లలో 78.47 సగటుతో 7,220 పరుగులు చేయగా... ఓడిన 73 మ్యాచ్‌లలో 35.61 సగటుతో 2,564 పరుగులు చేశాడు. జట్టు విజయాల్లో అతని పాత్ర ఏమిటో దీనిని బట్టి చెప్పవచ్చు.  

 50కి పైగా సగటుతో 10 వేల మార్క్‌ చేరిన ఇద్దరు ఆటగాళ్లలో ధోని ఒకడు కాగా, మరొకడు కోహ్లి.  

తొలుత బ్యాటింగ్‌ సమయంలో 89 ఇన్నింగ్స్‌లలో 49.92 సగటుతో 4,469 పరుగులు చేసిన కోహ్లి...ఛేదనలో 116 ఇన్నింగ్స్‌లలో 68.54 సగటుతో 6,032 పరుగులు సాధించాడు.  

 కోహ్లి ఒక్క తిసారా పెరీరా (శ్రీలంక) బౌలింగ్‌లోనే 262 పరుగులు చేశాడు.  

టాప్‌ –5 స్కోర్లు  
183          పాకిస్తాన్‌పై, 2012 
160 నాటౌట్‌      దక్షిణాఫ్రికాపై, 2018 
157 నాటౌట్‌     వెస్టిండీస్‌పై, 2018 
154 నాటౌట్‌     న్యూజిలాండ్‌పై, 2016 
140          వెస్టిండీస్‌పై, 2018 

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు: 30
మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు: 6 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement