దుబాయ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచాడు. తాను కోల్పోయిన అగ్రస్థానాన్ని కేవలం పదిరోజుల్లోనే కోహ్లీ తిరిగి సొంతం చేసుకోవడం విశేషం. న్యూజిలాండ్ పై సొంతగడ్డపై ఇటీవల జరిగిన వన్డే సిరీస్ ను భారత్ 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో ఛేజింగ్ స్టార్ కోహ్లీ రెండు సెంచరీలతో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సిరీస్ లో పరుగుల వరద పారించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న కోహ్లీ.. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లో మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
దక్షిణాఫ్రికా విధ్వంసక క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ను వెనక్కి నెట్టి కోహ్లీ ఈ టాప్ ర్యాంకుకు ఎగబాకాడు. దీంతోపాటు కెరీర్ లోనే ఏ భారత బ్యాట్స్ మెన్ కు సాధ్యం కాని వన్డే రేటింగ్ పాయింట్లు కోహ్లీ సాధించాడు. 889 అత్యుత్తమ రేటింగ్ పాయింట్లతో భారత్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సొంతం చేసుకున్న క్రికెటర్ గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ (887 రేటింగ్ పాయింట్లు) పేరిట ఉండేది. ఇటీవల 887 పాయింట్లు సాధించి సచిన్ సరసన నిలిచిన కోహ్లీ తాజా సిరీస్ లో వీర విహారంతో 889 పాయింట్లకు చేరాడు. సఫారీ క్రికెటర్ డివిలియర్స్(872 పాయింట్లు), ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(865 పాయింట్లు) కోహ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
జట్టు ర్యాకింగ్స్ లో దక్షిణాఫ్రికా, టీమిండియాలు 120 పాయింట్లతో ఉన్నప్పటికీ రేటింగ్ పాయింట్లలో స్వల్ప ఆధిక్యంలో ఉన్న సఫారీలు పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకోగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఐసీసీ తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ(7), ఎంఎస్ ధోనీ (11), శిఖర్ ధావన్(15)లు మాత్రమే టాప్-20లో చోటు దక్కించుకున్నారు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ పట్టికలో బూమ్రా మూడో ర్యాంకు సాధించి కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ ను నమోదు చేశాడు. బూమ్రా(3), అక్షర్ పటేల్(8), భువనేశ్వర్ కుమార్(15)లు మాత్రమే టాప్ 20లో చోటు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment