కోల్‌కతా: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని ఎంపిక చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కోహ్లిని ‘ఖేల్‌రత్న’కు నామినేట్ చేయడం ఇది రెండోసారి. 2016లోనూ అతని పేరును పంపినప్పటికీ ఒలింపిక్స్ జరిగిన ఏడాది కావడంతో పతక విజేతలు పీవీ సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్)లతోపాటు దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్)కు ఉమ్మడిగా ఆ అవార్డు ఇచ్చారు. దీంతో కోహ్లికి నిరాశే ఎదురైంది. ఈసారి అతనికి ఈ అవార్డు వచ్చే అవకాశముంది. గత ఏడాది కోహ్లి నాయకత్వంలో భారత్ మూడు ఫార్మాట్‌లలో కలిపి 46 మ్యాచ్‌లు ఆడి 31 విజయాలు సాధించింది. 11 మ్యాచ్‌ల్లో ఓడి, మూడు మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. వ్యక్తిగతంగా కోహ్లి మూడు ఫార్మాట్‌లలో కలిపి 52 ఇన్నింగ్స్‌లు ఆడి 2,818 పరుగులు సాధించాడు.
ఇందులో 11 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలున్నాయి. మరోవైపు కుర్రాళ్లను, యువ జట్లను విజయవంతంగా తీర్చిదిద్దిన జూనియర్ టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను ‘ద్రోణాచార్య’ అవార్డుకు... ప్రతిష్టాత్మక ‘ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య’ పురస్కారానికి బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ను క్రికెట్ బోర్డు నామినేట్ చేసింది. పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ బీసీసీఐ నామినీలను ధ్రువీకరించారు. ‘వివిధ కేటగిరీలకు బోర్డు తరఫున భారత ప్రభుత్వానికి నామినేషన్లను పంపాం. ద్రోణాచార్య అవార్డుకు ద్రవిడ్‌ను నామినేట్ చేశాం’ అని ఆయన తెలిపారు. ‘మిస్టర్ డిపెండబుల్’ మార్గదర్శనంలో జూనియర్ టీమిండియా ఈ ఏడాది అండర్–19 ప్రపంచకప్ గెలిచింది. భారత్ ‘ఎ’ జట్టు కూడా విదేశీ గడ్డపై విజయాలు నమోదు చేసింది. గతంలో క్రికెటర్లను తీర్చిదిద్దిన కోచ్‌లను ‘ద్రోణాచార్య’ కోసం బోర్డు సిఫార్సు చేసేది. కానీ ఒక క్రికెటర్‌కు పలువురు కోచ్‌లు నేనంటే నేనని ప్రకటించుకోవడంతో కొంతకాలంగా ‘ద్రోణాచార్య’ నామినీలను నిలిపివేసింది. కోహ్లి కోచ్ రాజ్‌కుమార్ శర్మకు ‘ద్రోణాచార్య’ లభించినప్పటికీ అది బోర్డు నామినేషన్ ద్వారా కాదు. వ్యక్తిగత దరఖాస్తుతో దక్కింది.
‘అర్జున’కు బాక్సర్లు గౌరవ్, సోనియా: భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) గౌరవ్ బిధురి, సోనియా లాథర్‌లను ‘అర్జున’ అవార్డుకు నామినేట్ చేసింది. మహిళల కోచ్ శివ్ సింగ్, అతని సహాయకులు భాస్కర్ భట్, సంధ్య గురుంగ్‌లను ‘ద్రోణాచార్య’ పురస్కారానికి సిఫారసు చేసింది.
‘ఖేల్‌రత్న’కు కోహ్లి
Published Fri, Apr 27 2018 12:52 AM | Last Updated on Fri, Apr 27 2018 12:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment