న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి... 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ గతేడాది ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను పేర్లను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న’కు సిఫారసు చేశారు. రిటైర్డ్ జస్టిస్ ఇందర్‌మీత్ కౌల్ కొచ్చర్ నేతృత్వంలో సోమవారం సమావేశమైన అవార్డుల సెలెక్షన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరితోపాటు ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే ‘అర్జున’ అవార్డుల కోసం 20 మంది పేర్లను సెలెక్షన్ కమిటీ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించింది. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఆమోదం లభించాక ఈ జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఈనెల 25న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డులను క్రీడాకారులు స్వీకరిస్తారు. ‘ఖేల్ రత్న’ పురస్కారం పొందిన వారికి పతకం, ప్రశంసా పత్రంతోపాటు రూ. 7 లక్షల 50 వేలు... ‘అర్జున’ అవార్డీలకు అర్జునుడి ప్రతిమతోపాటు రూ. 5 లక్షల నగదు పురస్కారం అందజేస్తారు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... ఆసియా క్రీడల షూటింగ్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ షూటర్‌గా గుర్తింపు పొందిన రాహీ సర్నోబాత్... ఫిన్‌లాండ్‌లో జరిగిన ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచి కొత్త చరిత్ర సృష్టించిన హిమ దాస్... కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్‌లో రెండు స్వర్ణాలు సాధించిన మనిక బాత్రాల ప్రదర్శనకు ‘అర్జున’ రూపంలో సముచిత గుర్తింపు లభించింది.
మూడోసారి ఖాయం...
టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్న కోహ్లికి మూడో ప్రయత్నంలో ఖేల్ రత్న ఖాయమైంది. 2016, 2017లలోనూ బీసీసీఐ కోహ్లి పేరును నామినేట్ చేసినా తిరస్కరణకు గురైంది. 29 ఏళ్ల కోహ్లి ఇప్పటివరకు 71 టెస్టులు ఆడి 6147 పరుగులు... 211 వన్డేలు ఆడి 9779 పరుగులు... 62 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడి 2102 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ (100 సెంచరీలు) తర్వాత అత్యధిక శతకాలు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి (58) రెండో స్థానంలో ఉండటం విశేషం.
‘డబుల్స్’ రాకెట్...
తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఒక్కరికే అర్జున అవార్డు ఖాయం కానుంది. తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్ట్ ప్లేయర్ సిక్కి రెడ్డి పేరును సిఫారసు చేశారు. గత నాలుగేళ్లలో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు సాధించిన గొప్ప విజయాల్లోనూ సిక్కి భాగస్వామ్యం కూడా ఉంది. మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో కలిపి ఆమె ఇప్పటివరకు 10 స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. 2014 ఆసియా క్రీడల్లో మహిళల టీమ్ విభాగంలో కాంస్యం... 2014, 2016 ఉబెర్ కప్‌లో కాంస్యం... 2018 కామన్వెల్త్ గేమ్స్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో స్వర్ణం... మహిళల డబుల్స్ విభాగంలో కాంస్యం సిక్కి ఖాతాలో ఉన్నాయి.
శ్రీకాంత్‌ను వెనక్కి నెట్టి...
గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించిన ఆంధ్రప్రదేశ్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ‘ఖేల్ రత్న’ రేసులో నిలిచినప్పటికీ... 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణాన్ని అందించిన మణిపూర్ లిఫ్టర్ మీరాబాయి చానువైపు సెలెక్షన్ కమిటీ మొగ్గు చూపింది. గతేడాది అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి 48 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించింది. అయితే గాయం కారణంగా ఆసియా క్రీడలకు దూరమైన ఆమె 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడమే లక్ష్యంగా సాధన చేస్తోంది.
రాజీవ్ గాంధీ ఖేల్‌రత్నకు ప్రతిపాదిత పేర్లు: విరాట్ కోహ్లి (క్రికెట్), మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్).
అర్జున అవార్డులకు ప్రతిపాదిత పేర్లు: నేలకుర్తి సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), హిమ దాస్ (అథ్లెటిక్స్), స్మృతి మంధాన (క్రికెట్), సవిత పూనియా (హాకీ), రాహీ సర్నోబాత్ (షూటింగ్), శ్రేయసి సింగ్ (షూటింగ్), మనిక బాత్రా (టేబుల్ టెన్నిస్), పూజా కడియాన్ (వుషు), నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), రోహన్ బోపన్న (టెన్నిస్), జి. సత్యన్ (టేబుల్ టెన్నిస్), జిన్సన్ జాన్సన్ (అథ్లెటిక్స్), సతీశ్ కుమార్ (బాక్సింగ్), మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), అంకుర్ మిట్టల్ (షూటింగ్), సుమీత్ (రెజ్లింగ్), రవి రాథోడ్ (పోలో), శుభాంకర్ శర్మ (గోల్ఫ్), అంకుర్ ధామ (పారాథ్లెటిక్స్), మనోజ్ సర్కార్ (పారా బ్యాడ్మింటన్).
ద్రోణాచార్య అవార్డులకు ప్రతిపాదిత పేర్లు (రెగ్యులర్): జీవన్‌జ్యోత్ తేజ (ఆర్చరీ), ఎస్.ఎస్.పన్ను (అథ్లెటిక్స్), సి.ఎ.కుట్టప్ప (బాక్సింగ్), విజయ్ శర్మ (వెయిట్ లిఫ్టింగ్), ఎ. శ్రీనివాసరావు (టేబుల్ టెన్నిస్).
లైఫ్‌టైమ్ విభాగం: క్లారెన్స్ లోబో (హాకీ), తారక్ సిన్హా (క్రికెట్), జీవన్ కుమార్ శర్మ (జూడో), వి.ఆర్.బీడు (అథ్లెటిక్స్).
ధ్యాన్‌చంద్ అవార్డులకు ప్రతిపాదిత పేర్లు: సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ), భరత్ చెత్రి (హాకీ), బాబీ అలోసియస్ (అథ్లెటిక్స్), దత్తాత్రేయ దాదూ చౌగ్లే (రెజ్లింగ్).
Comments
Please login to add a commentAdd a comment