2021-22 ఏడాదికి గానూ భారత క్రికెట్‌లో(పురుషులు, మహిళలు) కలిపి కేవలం 114 మంది క్రికెటర్లకు మాత్రమే జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(NADA) డోపింగ్ టెస్టులు హాజరయ్యారని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) తెలిపింది. మంగళవారం వాడా(WADA) ఇండియా యాంటీ డోపింగ్ ప్రోగ్రామ్ పేరిట ఒక రిపోర్టును విడుదల చేసింది.
దేశంలోని అథ్లెట్లకు నిర్వహించిన డోపింగ్ టెస్టుకు సంబంధించి తెలియని చాలా విషయాలు రిపోర్టులో చాలా ఉన్నాయని వాడా పేర్కొంది. ప్రముఖ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్.. సమాచార హక్కు చట్టం కింద 2021-22లో ఎంత మంది ఇండియన్ క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు నిర్వహించారనే దానిపై కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.
నేషనల్ యాంటీ డోపింగ్ ఏజేన్సీ(నాడా-NADA) ప్రకారం 2021, 2022 ఏడాదిలో మొత్తంగా 5961 డోపింగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో కేవలం 114 మంది భారత క్రికెటర్లు ఉంటే.. మిగతా వాళ్లు వివిధ రకాల క్రీడలకు చెందిన అథ్లెట్లు ఉన్నారు. ఇందులో 1717 మంది అథ్లెట్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌కు చెందినవారే ఉన్నారు.
రోహిత్ శర్మకు ఆరుసార్లు..
ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అత్యధికంగా ఆరుసార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహించినట్లు రిపోర్టులో ఉంది. ముంబై, అహ్మదాబాద్, చెన్నై, యూఏఈ వేదికగా రోహిత్‌కు ఆరుసార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇక రిషబ్ పంత్, సూర్యకుమార్, చతేశ్వర్ పుజారా సహా మరో నలుగురు క్రికెటర్లకు ఒకసారి డోపింగ్ టెస్టు నిర్వహించారు.
కోహ్లికి ఒక్కసారి కూడా..
మరో ఆసక్తికర విషయమేంటంటే.. బీసీసీఐలో కాంట్రాక్ట్ కలిగి ఉన్న 25 మంది ఆటగాళ్లలో 12 మందికి ఒక్కసారి కూడా డోపింగ్ టెస్టు నిర్వహించలేదు. ఆ లిస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సహా టి20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా, బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్.. బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, వికెట్ కీపర్లు సంజూ శాంసన్, కోన శ్రీకర్ భరత్‌లు ఉన్నారు. ఇక ఆల్‌రౌండర్లలో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు.
ఇక మహిళల జట్టులో మాత్రం కాంట్రాక్ట్ కలిగి ఉన్న ప్రతీ క్రికెటర్‌కు కనీసం ఒక్కసారైనా డోపింగ్ టెస్టు నిర్వహించారు. ఇందులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానలకు మూడుసార్లు డోపింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ డేటా ఆటగాళ్లు ఎలాంటి తప్పు చేయలేదని సూచించదు. అయినప్పటికీ, సంభావ్య నేరస్థులను పట్టుకోవడంలో NADA తగినంతగా చేయడం లేదని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) తన వాదనను ఇది మరింత నొక్కి చెబుతుంది.
దేశంలోని ఒలింపిక్ అథ్లెట్లను టార్గెట్ చేస్తున్న నాడా డోపింగ్ టెస్టుల కోసం పురుషుల క్రికెటర్ల నమూనాలను సేకరించడంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పరోక్షంగా బీసీసీఐ హస్తం ఉందని.. నాడా వారికి భయపడే అతి తక్కువ మంది క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు నిర్వహిస్తోందని వాడా స్పష్టం చేసింది.
రవి దహియా ఇంటికి 18సార్లు..
ఇక జనవరి 2021 నుంచి డిసెంబర్ 2022 వరకు జాతీయ యాంటీ డోపింగ్ సంస్థ(నాడా) డోపింగ్ టెస్టు నిర్వహించడం కోసం ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ రవీ దహియా ఇంటికి 18సార్లు వెళ్లినట్లు సమాచారం. నిషేధిక డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు రావడంతో న్యూఢిల్లీతో పాటు తన సొంత రాష్ట్రం హర్యానాలోని సోన్‌పట్‌కు వెళ్లి అతని యూరిన్, బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు.
నీరజ్ చోప్రాను వదల్లేదు..
ఇక మహిళా వెయిట్‌లిఫ్టర్.. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాభాయి చానుకు కూడా ఎనిమిది సార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. పాటియాల, గాంధీనగర్‌తో పాటు విదేశాల్లోనూ ఆమెకు డోపింగ్ టెస్టులు చేశారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో మన దేశానికి బంగారు పతకం అందించిన జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాను కూడా వదల్లేదు. 2021 నుంచి 2022 ఏడాదిలో నీరజ్ చోప్రాకు ఐదుసార్లు డోపింగ్ టెస్టులు నిర్వహించారు. పాటియాలా, ఫిన్లాండ్, అమెరికాలోనూ ఈ టెస్టులు చేవారు. అయితే ఇవన్నీ ఆటగాళ్లకు ఎలాంటి కాంపిటీషన్స్ లేనప్పుడు కూడా నిర్వహించడం ఆసక్తి కలిగించింది.
మరి భారత క్రికెటర్లు ఏడాది పొడవునా ఏదో ఒక సిరీస్ ఆడుతూనే ఉంటారు. క్షణం తీరిక లేకుండా స్వదేశం, విదేశాల్లో టోర్నీలు ఆడే టీమిండియా మధ్యలో ఐపీఎల్ కూడా ఆడుతుంది. మరి ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడానికి డోపింగ్ టెస్టులు క్రమం తప్పకుండా చేయాల్సిందే. ఫిట్‌నెస్ సాధించడానికి 'యోయో(YOYO)' పేరుతో ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహిస్తున్నారే తప్ప ఎవరైనా క్రికెటర్ నిషేధిత డ్రగ్ ఏమైనా వాడుతున్నాడా అనేది డోపింగ్ టెస్టులో నిర్వహిస్తేనే బయటపడుతుంది.
మన దేశంతో పోలిస్తే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్లకు క్రమం తప్పకుండా డోపింగ్ టెస్టులు నిర్వహిస్తుంటారు. ఇంగ్లండ్ ఏజెన్సీ 96 మంది పురుషుల క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు నిర్వహిస్తే.. ఆస్ట్రేలియా ఏజెన్సీ 69 మంది మెన్స్ క్రికెటర్లకు నిర్వహించింది. కానీ భారత్‌లో మాత్రం నాడా 12 మంది పురుషుల క్రికెటర్లకు మాత్రమే డోపింగ్ టెస్టులు నిర్వహించింది.
చదవండి: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు: బ్రిజ్‌భూషణ్‌కు బెయిల్
Comments
Please login to add a commentAdd a comment