బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. వర్క్ లోడ్ కారణంగా బుమ్రాను పక్కకు పెట్టాలని భావిస్తున్న సెలెక్టర్లు.. ఫామ్‌లో లేని రోహిత్, విరాట్‌లను విశ్రాంతి పేరుతో తప్పిస్తారని తెలుస్తుంది. జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే రోహిత్, కోహ్లి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేది కూడా అనుమానంగానే కనిపిస్తుంది. వాస్తవానికి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఉంది.
అలాంటి ఈ సిరీస్‌కే రోహిత్, కోహ్లిలకు రెస్ట్ ఇస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఆడిస్తారని అనుమానాలు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన ఎనిమిది రోజుల గ్యాప్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. ఈ మెగా టోర్నీలో ఆడకముందు ఫామ్‌లో లేని రోహిత్, కోహ్లి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడాలి.
ఈ ఇద్దరు వన్డేలు ఆడి చాలాకాలం అవుతుంది. రోహిత్, కోహ్లి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటే టీమిండియాకే నష్టం వాటిల్లుతుంది. టెస్ట్‌ల్లో ప్రస్తుతం రోహిత్, కోహ్లి మెడపై కత్తి వేలాడుతుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వీరిద్దరినీ వన్డేల నుంచి కూడా తప్పిస్తారేమో అనిపిస్తుంది.
కాగా, భారత టెస్ట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 1-2 తేడాతో వెనుకపడి ఉంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. రోహిత్, కోహ్లి, బుమ్రా ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో భాగంగా ఉన్నారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంటే రోహిత్, కోహ్లి దారుణంగా విఫలమవుతున్నారు. బుమ్రా ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీసి సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం బుమ్రాపై ఉన్న వర్క్ లోడ్‌ను బట్టి చూస్తే అతనికి విశ్రాంతినివ్వడం సమంజసమే అనిపిస్తుంది. ఫామ్‌లో లేక జట్టుకు భారమైన రోహిత్, కోహ్లిలను తదుపరి సిరీస్ ఆడించరంటే అది పరోక్షంగా తప్పించడమే అనుకోవాలి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం భారత్ జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఐదు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తుంది.
ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్
జనవరి 22- తొలి టీ20 (కోల్‌కతా)
జనవరి 25- రెండో టీ20 (చెన్నై)
జనవరి 28- మూడో టీ20 (రాజ్‌కోట్)
జనవరి 31- నాలుగో టీ20 (పూణే)
ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)
ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్‌పూర్)
ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)
ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)
ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ అనంతరం భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ (వన్డేలు) ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మ్యాచ్‌లు మినహా మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లో జరుగుతాయి. మెగా టోర్నీలో భారత ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉండబోతుంది.
ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (దుబాయ్)
ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (దుబాయ్)
మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (దుబాయ్)
గ్రూప్ దశలో ఫలితాల ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీలో తదుపరి మ్యాచ్‌లు (సెమీస్, ఫైనల్) ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment