విరాట్ కోహ్లి
రాంచీ : తక్కువ వ్యవధిలో వికెట్లు కోల్పోవడం మళ్లీ చూడదల్చుకోలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. శుక్రవారం రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి శతకంతో అదరగొట్టినా అది భారత విజయానికి సరిపోలేదు. మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. తమ అంచనాలు తప్పడం వల్లే ఓటమి చవిచూశామని, తమ కన్నా అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆతిథ్య ఆటగాళ్లు విజయానికి అర్హులని వ్యాఖ్యానించాడు.
‘రాత్రి 7.30 సమయంలో మంచు ప్రభావం చూపిస్తుందని మాకు ఎవరో చెప్పారు. అందుకే ముందు బౌలింగ్ ఎంచుకున్నా. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆరంభంలోనే ఇలా మేం వికెట్లు కోల్పోలేదు. మూడేసి వికెట్లు తక్కువ వ్యవధిలో పడిపోవడం సిరీస్‌లో రెండు సార్లు జరిగింది. ఇకపై ఇలా కుప్పకూలిపోవడాన్ని చూడదల్చుకోలేదు. ఈ సమస్యను అధిగమించడంపై దృష్టి సారిస్తాం. తర్వాతి మ్యాచ్‌లకు మార్పులు ఖాయం. చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పడంపై కసరత్తులు చేస్తాం. నేను ఆడిన చక్కటి ఇన్నింగ్స్‌లలో ఇది కూడా ఒకటి. మూడు వికెట్ల అనంతరం క్రీజులోకి వచ్చినప్పుడు ఒక్కటే అనుకున్నా.. నేను నా ఆటను ఆడుతాను. తర్వాత ఏం జరుగుతుందనేది నాకు అనవసరం. ఇదే రీతిలో షాట్స్ ఆడాను. కానీ నేను ఔటవ్వడం నిరాశను మిగిల్చింది. మేం గెలుస్తామని అనుకున్నా. కానీ ఆసీస్ ఆటగాళ్లు మా కన్నా అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఆడమ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వారు ఈ విజయానికి అర్హులు.’ కోహ్లి వ్యాఖ్యానించాడు.
ఇక కోహ్లి వ్యాఖ్యలను బట్టి జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. గత మూడు వన్డేల్లో నిరాశపర్చిన శిఖర్ ధావన్, అంబటి రాయుడులలో ఒక్కరిని పక్కకు పెట్టే అవకాశం ఉంది. ఇక చివరి రెండు వన్డేలకు ధోని విశ్రాంతి తీసుకోవడంతో పంత్ బెర్త్ ఖాయమైంది. కేఎల్ రాహుల్‌కు అవకాశం దక్కనుంది. బౌలింగ్ విభాగంలో షమీ స్థానంలో భువనేశ్వర్ తుది జట్టులోకి రానున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment