న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కొత్తగా కౌంటీ ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. జూన్‌లో కౌంటీ జట్టు సర్రే తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు అవసరమైన మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కోహ్లి కౌంటీలపై ఆసక్తి కనబరిచాడు. దీంతో సర్రే అతనితో సంప్రదింపులు జరిపింది. చివరకు గురువారం ఆ జట్టే కోహ్లితో ఒప్పందం కుదిరిందని అధికారికంగా ప్రకటించింది.
దీంతో బెంగళూరులో అఫ్గానిస్తాన్‌తో 14 నుంచి 18 వరకు జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు అతను గైర్హాజరు కానున్నాడు. తన కౌంటీ క్రికెట్‌పై కోహ్లి స్పందించాడు. ‘నేను కౌంటీ క్రికెట్ ఆడాలని ఎన్నాళ్ల నుంచో కోరుకుంటున్నాను. సర్రేతో ఇప్పటికీ నా కోరిక తీరనుంది. ఈ అవకాశం ఇచ్చిన సర్రే డైరెక్టర్ అలెక్ స్టివార్ట్‌కు థ్యాంక్స్’ అని అన్నాడు. వచ్చే నెలలో కోహ్లి సర్రే తరఫున మూడు మ్యాచ్‌ల్లో పాల్గొంటాడు. జూన్ 9 నుంచి 12 వరకు హ్యాంప్‌షైర్‌తో, తర్వాత సోమర్‌సెట్ (20–23), చివరగా యార్క్‌షైర్ (25–28)తో జరిగే మ్యాచ్‌ల్లో కోహ్లి ఆడతాడు.
Comments
Please login to add a commentAdd a comment