'కోహ్లి నీ పరుగులు నేను తీశాను.. డబ్బులు కట్టు'
మొహలీ: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి దూకుడును, ఒత్తిడిలోనూ స్థిరచిత్తంతో ఆడిన అతడి ప్రతిభను కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రశంసల్లో ముంచెత్తాడు. దూకుడుగా ఆడటమే అతడి బలమని, దానిని ఎప్పుడూ వదిలిపెట్టకుండా స్థిరచిత్తంతో ఆడితే సరిపోతుందని చెప్పాడు. మొహాలిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 51 బంతుల్లో 82 పరుగులు చేసి ఒంటిచేత్తో భారత్‌కు విజయాన్నందించాడు. కెప్టెన్ ధోనీతో కలిసి అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు అజేయంగా 31 బంతుల్లో 67 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ భాగస్వామ్యంలో కోహ్లి వాటానే ఎక్కువ.
కోహ్లి చాలా సందర్భాల్లో రిస్క్ చేసి మరీ రెండు పరుగులు తీశాడు. ఇదే భారత జట్టును విజయం దిశగా నడిపించింది. నిజానికి ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తేవాళ్లే. ఇలా వేగంగా పరుగులు తీయడంపై ధోనీ స్పందిస్తూ.. కోహ్లి లాంటి ఫాస్ట్ రన్నర్ ఉండటం జట్టుకు బాగా కలిసొచ్చే అంశమని పేర్కొన్నాడు. 'అతడు నాకు ఇప్పటికీ డబ్బు కట్టాల్సి ఉంది. అతని పరుగుల కోసం నేను పరిగెత్తాను' అంటూ ఛలోక్తి విసిరాడు.
'మిడిల్ ఓవర్లలో నువ్వు మంచి రన్నర్‌వి అయితే.. మీపై ఒత్తిడి తగ్గి, బౌలర్లు, ఫీల్డర్లపై ఒత్తిడి పడుతుంది. నిజానికి నేనేం గ్రేట్ బ్యాట్స్‌మన్‌ను కాను. సంప్రదాయబద్ధమైన క్రికెట్‌ను మాత్రమే ఆడుతాను. కొడితే రెండు పరుగులు తీయడం లేదా సిక్స్ బాదడం అంతే నేను చేసేది. విరాట్ లాగా ఎటుపక్కకైనా షాట్లు నేను కొట్టలేను' అని ధోనీ అన్నాడు. 'ప్రశాంత చిత్తంతో ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలం. కోహ్లి ఇలాంటి స్థిరచిత్తంతో ఉండటమే కాదు.. దూకుడుగా సవాళ్లను కూడా స్వీకరిస్తాడు. అదే అతడిలోని గొప్ప విషయం. అతను ప్రస్తుతం సరైన దిశలో సాగుతున్నాడు. అతనెప్పుడు తన దూకుడుని వదులుకోకూడదు. దూకుడే అతడి బలం. కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఫిట్‌గా ఉన్నాడు. ఎక్కడైనా ఫీల్డింగ్ కూడా చేయగలడు' అని ధోనీ కొనియాడాడు.