అతడి దెబ్బకు కన్ను వాచింది.. అలా ప్రతీకారం తీర్చుకున్నా: కోహ్లి | Sakshi
Sakshi News home page

Virat Kohli: అతడి దెబ్బకు కన్ను వాచింది.. అయినా చితక్కొట్టేశాను!

Published Sat, Apr 13 2024 11:03 AM

Isko Main Itna Maarunga: Kohli Recalls Bitter Rivalry With Australia Pacer - Sakshi

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లికి టెస్టుల్లో ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. ఆసీస్‌ పోరంటే ఈ రన్‌మెషీన్‌ మరింత జోరుగా బ్యాట్‌ ఝులిపిస్తాడు. ఇక 2014- 15లో తొలిసారిగా కంగారూ గడ్డ మీద భారత కెప్టెన్‌ హోదాలో ఆడిన కింగ్‌ కోహ్లి.. 692 పరుగులతో అదరగొట్టాడు.

ఆ సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లలో టాప్‌ స్కోరర్‌గా నిలిచి సత్తా చాటాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో వరుస సెంచరీలతో అదరగొట్టిన కోహ్లి.. తదుపరి బ్రిస్బేన్‌లో మాత్రం విఫలమయ్యాడు.

అనంతరం మెల్‌బోర్న్‌, సిడ్నీ టెస్టుల్లో మళ్లీ కమ్‌బ్యాక్‌ ఇచ్చి తానేంటో నిరూపించుకున్నాడు. అయితే, ఆ సిరీస్‌లో టీమిండియా ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది. తొలి రెండింటిలో గెలిచిన ఆస్ట్రేలియా.. ఆఖరి రెండు టెస్టులను డ్రా చేసుకుని ట్రోఫీ కైవసం చేసుకుంది. 

ఇక ఈ సిరీస్‌ సందర్భంగా జరిగిన ఆసక్తికర ఘటన గురించి ప్రస్తావిస్తూ విరాట్‌ కోహ్లి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆనాటి సంగతులు గుర్తు చేసుకుంటూ.. ‘‘ఆ టూర్‌లో మొదటి మ్యాచ్‌లో తమ మొదటి బంతినే మిచెల్‌ జాన్సెన్‌ విసురుగా విసరడంతో.. నా తలకు దెబ్బ తగిలింది.

అసలేం జరిగిందో కాసేపటి వరకు నాకేం అర్థం కాలేదు. దాదాపు 60 రోజుల పాటు.. అలా ఆడాలా.. ఇలా ఆడాలా అంటూ షాట్ల విషయంలో తికమకపడ్డా. దెబ్బ అంత గట్టిగా తగిలింది మరి! 

నా ఎడమ కన్ను వాపు వచ్చేది. కంటిచూపు కూడా కాస్త మందగించింది. అయితే, చాలా రోజుల వరకు నేను ఈ విషయాన్ని గమనించలేకపోయాను.

ఇక ఆరోజు లంచ్‌ సమయంలో.. నా ముందు రెండే ఆప్షన్లు మిగిలి ఉన్నాయని ఫిక్సయ్యాను. ఒకటి ఫైట్‌.. రెండోది ఫ్లైట్‌. పట్టుదలగా నిలబడి ఆడాలి లేదంటే వెళ్లిపోవాలి.. బాగా ఆలోచించి పోరాడాలనే నిర్ణయించుకున్నా.

ఇంతలో ఒకరు.. నిన్ను తల మీద కొట్టడానికి అతడికి ఎంత ధైర్యం అని నాతో అన్నారు. అందుకు బదులుగా..‘అతడి(బౌలింగ్‌)ని ఈ సిరీస్‌లో ఎంతలా చితక్కొడతానో చూడు’ అని చెప్పాను. అన్నట్లుగా అతడి బౌలింగ్‌ను తుత్తునియలు చేశాను’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

కాగా 2014 -15లో ఆసీస్‌తో సిరీస్‌లో తొలి టెస్టుకు నాటి కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని దూరం కాగా.. కోహ్లి సారథ్యం వహించాడు. ఇక రెండు, మూడో టెస్టులకు అందుబాటులోకి వచ్చిన ధోని.. ఆ తర్వాత అతడు రిటైర్మెంట్‌ ప్రకటించగా.. నాలుగో మ్యాచ్‌ నుంచి కోహ్లి అధికారికంగా టీమిండియా కెప్టెన్‌ అయ్యాడు. ప్రస్తుతం ఈ దిగ్గజాలు ఇద్దరూ ఐపీఎల్‌-2024తో బిజీగా ఉన్నారు.

చదవండి: అంపైర్‌తో గొడవపడ్డ పంత్‌.. తప్పెవరిది?.. మండిపడ్డ ఆసీస్‌ దిగ్గజం

Advertisement
Advertisement