‘నా సన్నిహితుల సంఖ్య చాలా తక్కువ’
అందుకే అన్నింటిపై ఏకాగ్రత పెట్టగలను ∙విరాట్ కోహ్లి వ్యాఖ్య
న్యూఢిల్లీ: జీవితంలో అతి దగ్గరైన సన్నిహితుల సంఖ్య ఎక్కువగా ఉండటం మంచిది కాదని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. దాని వల్ల ఏకాగ్రత దెబ్బ తినడమే కాకుండా సమయపాలన పాటించడం కూడా కష్టంగా మారిపోతుందని అతను అభిప్రాయపడ్డాడు. ‘అదృష్టవశాత్తూ నేను బాగా సన్నిహితంగా ఉండే మనుషులు నా జీవితంలో ఎక్కువ మంది లేరు. నా దృష్టిలో అది మన మంచికే. మనం తరచుగా మాట్లాడాల్సిన స్నేహితులు, మిత్రులు ఎక్కువ మంది ఉంటే అది మన పని నుంచి దృష్టిని మళ్లిస్తుంది. పైగా ప్రధాన విషయాలకు సమయం కేటాయించడం కూడా చాలా కష్టంగా మారిపోతుంది’ అని కోహ్లి చెప్పాడు. నేను ఈమాత్రం సాధించగలను అంటూ తనకు తాను పరిమితులు విధించుకోనని, సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడేందుకు తాను సిద్ధమని అతను ప్రకటించాడు. ‘జీవితంలో నేను చేయదల్చుకున్న విషయాలకు ఎలాంటి పరిమితులూ పెట్టుకోను. మైదానంలో కూడా నా శ్రమలో ఎలాంటి మార్పు ఉండదు. అనుకున్నదానిని అనుకున్నట్లుగా చేసే విషయంలో ఇప్పటి వరకు అంతా నా ప్రణాళిక ప్రకారమే సాగుతోంది’ అని కోహ్లి అభిప్రాయం వ్యక్తం చేశాడు. సచిన్‌తో తనను పోల్చడంపై మాట్లాడుతూ, తాను ఎన్నటికీ సచిన్ ఆడినంత కాలం (24 ఏళ్లు), 200 టెస్టులు ఆడలేనని, 100 అంతర్జాతీయ సెంచరీలు చేయలేనన్న విరాట్... అత్యుత్తమ స్థాయిలో ఆటను ముగించగలనని మాత్రం నమ్ముతున్నానన్నాడు.
తీవ్రంగా కష్టపడ్డాను...
2014 ఇంగ్లండ్ పర్యటనలో ఘోరంగా విఫలమైన కోహ్లి, అనంతరం ఆస్ట్రేలియా గడ్డపై చెలరేగిపోయాడు. ఆ తర్వాత అద్భుత ప్రదర్శనతో వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. సాంకేతికంగా కొన్ని అంశాలను సరిదిద్దుకున్న తర్వాతే తన ఆటతీరు మారిందని అతను గుర్తు చేసుకున్నాడు. ‘నా స్టాన్స్‌ను మార్చుకున్నాను. షార్ట్ బంతులకు నేను ఎప్పుడూ భయపడలేదు కానీ బౌలర్లను ఆలోచనలో పడే విధంగా క్రీజ్‌లో నిలబడ్డాను. దాంతో నా ప్యాడ్లపై బంతులు వేయడం వారికి చాలా కష్టంగా మారిపోయింది. ఇప్పుడు అంతా బాగుంది కానీ ఆరంభంలో అలవాటు పడేందుకు తీవ్రంగా శ్రమించాను. రోజూ మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేశాను. ఆ సమయంలో నా చేతి కండరాలు పట్టేశాయి. ఇలా పది రోజులు చేశాను. సచిన్ సూచనలు కూడా ఇందుకు ఉపకరించాయి. ఆరంభంలో ఆన్ సైడ్‌లోనే బాగా ఆడేవాన్ని. కానీ గ్రిప్ మార్చి ఆఫ్ సైడ్‌లో కూడా ఎంతో మెరుగయ్యాను’ అని కోహ్లి విశ్లేషించాడు.