
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తాను చేసిన శతకం తన కెరీర్‌లో రెండో అత్యుత్తమమని అంటున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. సహచరులంతా చేతులెత్తేసిన పరిస్థితుల్లో, ఒంటి చేత్తో జట్టును గట్టెక్కించిన ఈ ఇన్నింగ్స్ కంటే... 2014 ఆడిలైడ్ టెస్టులో చేసిన 141 పరుగులకే అతడు అగ్రస్థానం ఇచ్చాడు. ‘ఆడిలైడ్ ఇన్నింగ్స్ నాకు చాలా ప్రత్యేకం. అప్పుడు మేం భారీ ఛేదన (364 పరుగులు)లో ఉన్నాం. అందుకని ఈ శతకానిది రెండో స్థానమే. అయినా నేను చాలా సంతోషంగా, గొప్పగా భావిస్తున్నా’ అని అన్నాడు. మరోవైపు ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించలేకపోవడంపై విరాట్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘మూడంకెల స్కోరు కాదు. తర్వాత కొనసాగడం ముఖ్యం. వారికంటే కనీసం 10–15 పరుగులైనా ఎక్కువ చేయాల్సింది’ అని పేర్కొన్నాడు.
కోహ్లికి మందలింపు...
మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు భారత కెప్టెన్ కోహ్లితో మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో వ్యక్తిగతంగా మాట్లాడారు. తొలి ఇన్నింగ్స్‌లో రూట్‌ను రనౌట్ చేశాక బూతు మాటలతో అతడిని సాగనంపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారికంగా ఎలాంటి చర్యా లేకపోయినా... క్రికెటర్‌గా మైదానంలో ఎలా క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాలో, క్రమశిక్షణతో మెలగాలో కోహ్లికి ఆయన గుర్తు చేశారు.