బెంగళూరు: అందరి దృష్టి అతడి మీదే. అతడు ఎలా చెలరేగుతాడో చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. సొంత మైదానంలో అరుదైన రికార్డు సాధిస్తాడా, లేదా అని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తనకు కలిసొచ్చిన చిన్నస్వామి స్టేడియంలో 'విరాట్' పర్వం లిఖించాలని కోరుకుంటున్నారు. నేడు జరగనున్న ఐపీఎల్-9 మొదటి క్వాలిఫయిర్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్.. విరాట్ కోహ్లి గురించే చర్చించుకుంటున్నారు.
ఈ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న బెంగళూరు కెప్టెన్ మరో 81 పరుగులు చేస్తే అరుదైన ఘనత అతడి సొంతమవుతుంది. 14 మ్యాచ్‌లలో 4 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో ఏకంగా 919 పరుగులు చేసిన కోహ్లి 81 పరుగులు సాధిస్తే వెయ్యి పరుగులు పూర్తవుతాయి. కోహ్లి ప్రస్తుత ఫామ్ ను బట్టి చూస్తే అతడు వెయ్యి పరుగుల మైలురాయిని అందుకునేలా కన్పిస్తున్నాడు. ఈ మైదానంలో గత నాలుగు మ్యాచ్‌లలో కలిపి 351 పరుగులు చేసిన 'మిస్టర్ అగ్రసివ్' ఈ ఫీట్ సాధిస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఒకవేళ ఈ మ్యాచ్ లో విఫలమైనా అతడికి మరో అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ ఫైనల్స్ కు చేరితే మరో మ్యాచ్ ఆడతాడు. బెంగళూరు ఓడితే అతడికి రెండు మ్యాచ్ లు ఆడొచ్చు. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిన జట్టుతో రెండో క్వాలిఫయిర్ లో ఆడొచ్చు. ఈ మ్యాచ్ నెగ్గితే ఫైనల్లో ఆడే అవకాశం ఉంటుంది. మొత్తం మూడు మ్యాచ్ లు ఆడే అవకాశం ఉంది కాబట్టి కోహ్లి వెయ్యి పరుగులు పూర్తి చేయడం ఖాయమంటున్నారు అభిమానులు. ఇప్పటికే సింగిల్ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు.
కోహ్లి కొడతాడా?
Published Tue, May 24 2016 1:54 PM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM
Advertisement