న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని మరొకసారి వెనకేసుకొచ్చాడు మాజీ క్రికెటర్ మదన్‌లాల్. జట్టు సామర్థ్యం ఎలా ఉంటే మ్యాచ్‌లు గెలుస్తామో కోహ్లికి తెలిసినంతగా మరే భారత కెప్టెన్‌కు తెలియదన్నాడు. కేవలం విరాట్ కోహ్లి కారణంగా భారత పేస్ బౌలింగ్ విభాగం బలపడిందన్నాడు. అసలు భారత క్రికెట్‌లో ఇప్పటివరకూ పేస్ బౌలర్లను కోహ్లి ప్రోత్సహించినట్లు ఏ కెప్టెన్ చేయలేదన్నాడు. తాను చూసిన భారత జట్లలో కోహ్లి నేతృత్వంలోనే జట్టే అత్యంత పటిష్టంగా కనబడుతుందన్నాడు. ఇందుకు కారణం భారత పేస్ బౌలింగ్ ఎటాక్ పెరగడానికి కోహ్లి కృషి చేయడమేనన్నాడు. ఎవరికీ నమ్మశక్యం కాని రీతిలో కోహ్లి హయాంలోనే పేసర్లకు ఎక్కువ అవకాశాలు వచ్చాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. పేస్ బౌలింగ్ విలువ గురించి కోహ్లికి తెలుసు కాబట్టే పేసర్లకు లెక్కకు మించి అవకాశాలు వస్తున్నాయన్నాడు. (కరోనా సంక్షోభం తర్వాత తొలి క్రికెట్ లీగ్)
‘పేస్ బౌలింగ్‌ను పటిష్ట పరచడానికి కోహ్లి ఏదైతే మార్గం ఎంచుకున్నాడు అది ఆమోదయోగ్యమైనది. పేసర్లను ప్రోత్సహిస్తున్నది కోహ్లి ఒక్కడే. అంతకుముందు ఏ భారత కెప్టెన్ కూడా పేసర్లకు కోహ్లి తరహాలో అవకాశం ఇవ్వలేదు. 15-20 ఏళ్ల వెనక్కి వెళ్లి చూస్తే భారత్ ఎక్కువ మ్యాచ్‌లను గెలవలేకపోయేది. ఇప్పుడున్నది విన్నింగ్ టీమ్. ఇందుకు కారణం పేస్ ఎటాక్. పేస్ బౌలింగ్ విలువ కోహ్లి బాగా తెలుసు కాబట్టే దానిపై దృష్టి పెట్టాడు. పేస్ బౌలర్లను ప్రోత్సహించే కల్చర్ సునీల్ గావస్కర్ హయాం నుంచి వచ్చింది. దానిని కోహ్లి అమోఘంగా అవలంభిస్తున్నాడు. భవిష్యత్తులో నాలుగు నుంచి ఐదుగురు పేసర్లున్నా విజయాలు సాధిస్తూనే ఉంటాం’ అని మదన్‌లాల్ పేర్కొన్నాడు. ఇక ఫీల్డ్‌లో కోహ్లి దూకుడు గురించి మాట్లాడుతూ అది తనకెంతో ఇష్టమన్నాడు. చాలామంది కోహ్లి ప్రవర్తనను విమర్శించవచ్చు కానీ అందులో తన వరకూ అయితే ఎటువంటి లోపాలు కనిపించలేదన్నాడు. కోహ్లి తరహా దూకుడు జట్టుకు ఎంతో అవసరమన్నాడు. గతంలో భారత క్రికెటర్లే అంటే నెమ్మదస్తులు అనే పేరుండేదని, ప్రస్తుతం మన కెప్టెన్ కోహ్లి కారణంగా భారత జట్టు దూకుడు ప్రపంచానికి తెలిసిందన్నాడు. (ధోనిని కొట్టమని.. మమ్మల్ని అవతలికి కొట్టావా!)
Comments
Please login to add a commentAdd a comment