
సాక్షి, స్పోర్ట్స్ : క్రిస్ గేల్.. ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ట్వంటీ 20ల్లో అమోఘమైన రికార్డు ఈ విధ్వంసకర క్రికెటర్ సొంతం. ప‍్రధానంగా సిక్సర్ల కింగ్‌గా పిలుచుకునే గేల్... ఈసారి ఐపీఎల్ వేలంలో విపత్కర పరిస్థితి ఎదుర్కొన్నాడు. గత ఐపీఎల్ సీజన్‌ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన గేల్‌ను ఈ సారి వేలంలో ఆ జట్టు ఉద్వాసన పలికింది. అంతేగాకుండా ఏ ప్రాంచైజీ గేల్‌ను తీసుకోవడానికి ముందుకు రాలేదు. రూ.2 కోట్ల కనీస ధరతో రెండు సార్లు వేలంలో అతని పేరు ప్రకటించినా ఎవరూ ఆసక్తి కనబర్చలేదు. ఇక అమ్ముడుపోని క్రికెటర్లకు ఆఖర్లో మరొకసారి వేలం జరగ్గా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కనికరించి అదే బేస్ ప్రైస్‌కు సొంతం చేసుకుంది. అంత వరకు విముఖత కనబర్చి తరువాత ఎంపిక చేయడంపై క్రికెట్ అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి.
దీనిపై మాజీక్రికెటర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చాడు. ‘గేల్ ఓపెనింగ్ వస్తే ప్రత్యర్థి జట్లు భయపడతాయి. ఏ ప్రత్యర్థి జట్టుకైనా గేల్ విధ్వంసకర ఆటగాడు. ఇప్పటికే అతను నిరూపించుకున్నాడు. కింగ్స్ పంజాబ్ జట్టుకు ఆరోన్ ఫించ్, స్టోయినిస్, డేవిడ్ మిల్లర్, యువరాజ్ సింగ్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్‌లతో మంచి బ్యాటింగ్ లైనప్ కలిగిఉంది. ఈ లైనప్‌కు గేల్‌తో మరింత బలం చేకూరుతుంది. ఇక గేల్ అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఓపెనింగ్‌కు బ్యాక్ అప్‌గా తీసుకున్నాం’ అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment