గంగూలీ, గ్రేగ్ చాపెల్ (ఫైల్ ఫొటో)
కోల్‌కతా : టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి వ్యతిరేకంగా అప్పటి కోచ్ గ్రేగ్ చాపెల్ బీసీసీఐకి మెయిల్ రాయడాన్ని దాదాకు చెప్పింది తానేనని డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. శుక్రవారం కోల్‌కతాలో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన వీరు ఆనాటి రోజులను నెమరువేసుకున్నారు. ‘కడుపు నొప్పిగా ఉందని అంపైర్స్‌కు చెప్పి నేను ఫీల్డీంగ్ చేయకుండా మైదానం వీడాను. ఐదు ఓవర్లు విశ్రాంతి కావాలని కోరాను. నేను వెళ్లి గ్రేగ్‌చాపెల్ (అప్పటి టీమిండియా హెడ్ కోచ్) వెనుకాల కూర్చున్నాను. ఆ సమయంలో గ్రేగ్.. గంగూలీకి వ్యతిరేకంగా బీసీసీఐకి ఓ మెయిల్ రాయడం చూశాను. వెంటనే ఈ విషయాన్ని దాదాకు తెలియజేశానని’ సెహ్వాగ్ 2005 జింబాంబ్వే పర్యటనలోని ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.
ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అయిన గ్రేగ్‌చాపెల్‌ను బీసీసీఐ 2005లో భారత క్రికెట్ జట్టుకు హెడ్‌కోచ్‌గా నియమించింది. ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్నా గంగూలీకి, కోచ్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరి.. వివాదస్పదమైన విషయం తెలిసిందే. చివరకు గంగూలీ జట్టు నుంచి స్థానం కూడా కోల్పోయాడు.
క్రికెటర్‌గా అవి మధుర క్షణాలు.. ఆ రోజుల్లో తాను టెస్టులు ఆడలేనని, కేవలం తెల్లబంతితోనే రాణించగలనని అందరూ అంటుండేవారని సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు. ‘టెస్టుల్లో తొలి సెంచరీ సాధించినప్పుడు గంగూలీ కౌగిలించుకొని.. టెస్టుల్లో ఆడే అవకాశం కల్పించాడు. దీంతో నేనేంటో నిరూపించాలనుకున్నాను’.అని టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాపై 2001లో అరంగేట్ర మ్యాచ్‌లోనే సెహ్వాగ్(105) తొలి సెంచరీ నమోదు చేశాడు.
ఓపెనింగ్ అవకాశం ఇచ్చింది గంగూలే
సచిన్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగాలని గంగూలీ, అప్పటి కోచ్ జాన్‌రైట్‌లు తనకు సూచించారని సెహ్వాగ్ తెలిపాడు. ‘సచిన్, గంగూలీలు ఉన్న తర్వాత నేనేందుకు అని వారిని ప్రశ్నించా. మిడిలార్డర్‌లో ఆడనివ్వండని కోరా. కానీ సౌరవ్, జాన్‌రైట్‌లు ఆ ఓపెనింగ్ స్థానం నీకోసమేనని పట్టుబట్టి ఆడించారు.’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ఈ సీజన్ ఐపీఎల్‌లో సెహ్వాగ్ కింగ్స్ పంజాబ్ మెంటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో కొత్తగా సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న దినేశ్ కార్తీక్, అశ్విన్‌లను ఈ డాషింగ్ ఓపెనర్ కొనియాడాడు. దినేశ్ కార్తీక్ అన్ని ఫార్మాట్లలో తమిళనాడు కెప్టెన్‌గా వ్యవహరించాడని, అశ్విన్ చాలా స్మార్ట్ అని, బౌలర్‌గా మైదానంలోని పరిస్థితులను అర్థచేసుకోగలడని అభిప్రాయపడ్డాడు. ఇక ఈ ఇరు జట్ల మధ్య కోల్‌కతాలో ఈ రోజు మ్యాచ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment